
వినాయక ప్రతిమ ఏర్పాటులోనూ రాజకీయం
● ఎంతో కాలంగా ప్రతిష్టిస్తున్న స్థలాన్ని కాదన్న పోలీసులు
● టీడీపీ ఒత్తిడికి తలొగ్గి
ఊరి చివర పెట్టించిన వైనం
ఆత్మకూరు: కూటమి పాలనలో దేవుడి విగ్రహాల ఏర్పాటుకు సైతం రాజకీయాలు చేస్తున్న పరిస్థితి నెలకొంటోంది. స్థానిక టీడీపీ నేతలతో పాటు ‘పై’ నాయకుడి ఒత్తిడితో గ్రామ శివార్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు విగ్రహం పెట్టేలా పోలీసులు నిర్ణయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివరాలు.. మర్రిపాడు మండలం తిక్కవరంలో వినాయక చవితి ఉత్సవాలను ఉత్తరపువీధి యువత ఆధ్వర్యంలో 12 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఏడాది వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసే క్రమంలో స్థానిక టీడీపీ నేతలు రంగప్రవేశం చేశారు. ఏటా ప్రతిష్టించే స్థలంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయకూడదంటూ టీడీపీ నేతల ప్రమేయంతో పోలీసులు ఆదేశించారు. తాము ఏటా ఏర్పాటు చేస్తున్న స్థలం గ్రామకంఠమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం నేతలు పేర్కొన్నా, పోలీసులు ససేమిరా అన్నారు. సదరు స్థలంలో విగ్రహాన్ని టీడీపీ నేతలు ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. దీంతో గ్రామంలోని మరోచోట ఉన్న తమ సొంత సెటిల్‌మెంట్ పట్టా స్థలంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పినా, ఆత్మకూరు ఇన్‌చార్జి సీఐ, మర్రిపాడు ఎస్సై అంగీకరించలేదు. ఊరికి దూరంగా ఉండే స్థలంలోనే ఏర్పాటు చేసుకోవాలని ఖరాఖండీగా చెప్పారు. గ్రామకంఠ స్థలంలో బీసీ కాలనీకి వెళ్లే దారిని మూసేస్తూ పందిరి వేసి విగ్రహాన్ని పచ్చ పార్టీ నేతలు నెలకొల్పారు. దీంతో విధిలేక ఊరికి దూరంగా ఖాళీ స్థలంలో విగ్రహాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. చివరికి నిమజ్జన విషయంలోనూ ఇలానే వ్యవహరించారు. టీడీపీ వారు ఏర్పాటు చేసిన విగ్రహ ఊరేగింపు, నిమజ్జనం అనంతరం రాత్రి 12 గంటల తర్వాతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు జరుపుకోవాలని సూచించారు.