
వెరిఫికేషన్.. పెద్ద వర్రీ
నెల్లూరు (టౌన్): డీఎస్సీ వ్యవహారం లోపభూయిష్టంగా మారింది. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి కాల్ లెటర్లు అందుకునే వరకు అభ్యర్థుల్లో నెలకొన్న ఆందోళన కొనసాగుతూనే ఉంది. కాల్ లెటర్లు అందుకున్న వారికి సంబంధించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను నగరంలోని వైఎమ్సీఏ మైదానంలో గల వీఆర్ ఐపీఎస్ కళాశాలలో గురువారం నిర్వహించారు. మొత్తం 673 మందికి గానూ 17 డెస్క్‌లను ఏర్పాటు చేశారు.
తొలుత 585 మందికే..
తొలుత 585 మందికే కాల్ లెటర్లు రావడంతో 13 డెస్క్‌లతో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించారు. స్టేట్ అబ్జర్వర్‌గా సమగ్రశిక్ష ఏఎస్పీడీ రవీంద్రనాథ్‌రెడ్డిని నియమించారు. ప్రక్రియను డీఈఓ బాలాజీరావు పర్యవేక్షించారు. సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య, డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలు హాజరయ్యారు. ప్రక్రియను పొద్దుపోయే వరకు నిర్వహించనున్నారని సమాచారం. అప్పటికీ ఎవరైనా మిగిలి ఉంటే వారికి శుక్రవారం నిర్వహించనున్నారు.
అన్నీ అనుమానాలే..
డీఎస్సీ నోటిఫికేషన్‌పై అనేక అనుమానాలు నెలకొన్నాయి. జిల్లాలో 673 పోస్టులకు సబ్జెక్టుల వారీగా పరీక్షను నిర్వహించారు. 585 మందికి బుధవారం.. 50 మందికి గురువారం రాత్రికి కాల్ లెటర్లు పంపారు. మిగిలిన 38 మందికి ఇవి ఎప్పుడొస్తాయో ఎవరికీ తెలియదు. మరోవైపు శుక్రవారం ఉదయానికి వస్తాయని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
ఉపాధ్యాయ సంఘాల నేతల హల్‌చల్
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కేంద్రం వద్ద పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు హల్‌చల్ చేశారు. వృత్తిలోకి కొత్తగా అడుగిడనున్న వారిని ప్రసన్నం చేసుకొని తమ యూనియన్‌లో చేర్చుకునేందుకు పోటీపడ్డారు. ఇబ్బందులున్నాయని ఎవరైనా చెప్తే, వారిని జిల్లా విద్యాశాఖాధికారులు వద్దకు తీసుకెళ్లి మాట్లాడిస్తున్న పరిస్థితీ నెలకొంది. మరోవైపు అభ్యర్థుల కంటే ఉపాధ్యాయ సంఘాల నేతలే ఎక్కువగా ఉన్నారని పలువురు గుసగుసలాడుకున్నారు.
దివ్యాంగ అభ్యర్థులకు నేడు..
కాల్ లెటర్లను అందుకొని సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకున్న పీడబ్ల్యూడీ – వీహెచ్, ఓహెచ్, ఎంఐ దివ్యాంగ అభ్యర్థులు జిల్లా ప్రభుత్వాస్పత్రిలోని మెడికల్ సూపరింటెండెంట్‌తో ధ్రువీకరించుకొని సదరు పత్రాన్ని అందజేయాలని డీఈఓ బాలాజీరావు కోరారు. కొత్తగా కాల్ లెటర్లు అందుకున్న వారు వీఆర్ ఐపీఎస్ కళాశాలలో సర్టిఫికెట్లను శుక్రవారం వైరిఫై చేయించుకోవాలని సూచించారు. ఆపై మెడికల్ సూపరింటెండెంట్‌తో వెరిఫికేషన్ చేయించుకొని తమకు అందజేయాలని పేర్కొన్నారు.
పోస్టులు 673..
కాల్ లెటర్లు 635 మందికే
మిగిలిన వారికి నేడొస్తాయంటున్న
అధికారులు
అందరికీ పంపకపోవడంపై అనుమానాలు
డీఎస్సీలో ఇదీ కథ
మరో మెలిక
డీఎస్సీ పరీక్ష రాసిన అభ్యర్థులు రెండు లేదా మూడు కేటగిరీల్లో మెరిట్ ర్యాంకులను సాధించినా, నోటిఫికేషన్ సమయంలో ఇచ్చిన ప్రాధాన్యత మేరకే పోస్ట్‌ను ఇస్తామని రాష్ట్ర విద్యాశాఖాఽధికారులు మెలిక పెడుతున్నారు. నోటిఫికేషన్ సమయంలో అభ్యర్థులకు సరైన అవగాహన ఉండదని, ఈ విషయాన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలు సైతం తప్పుబడుతున్నారు. కేటగిరీల ఎంపికలో మెరిట్ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెరిట్ లిస్ట్‌లో పేరుండి కాల్ లెటర్ రాని వారు సైతం వెరిఫికేషన్ కేంద్రం వద్దకొచ్చారు.