
డిజిటల్ అసిస్టెంట్లకు ఉద్యోగోన్నతులు
నెల్లూరు(పొగతోట): గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న 82 మంది డిజిటల్ అసిస్టెంట్లకు గ్రేడ్ – 5 పంచాయతీ కార్యదర్శులుగా ఉద్యోగోన్నతులను కల్పిస్తూ ఉత్తర్వులను కలెక్టర్ ఆనంద్ జారీ చేశారు. ఈ క్రమంలో ఉద్యోగోన్నతులు పొందిన పంచాయతీ కార్యదర్శులకు నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో కౌన్సెలింగ్‌ను డీపీఓ శ్రీధర్‌రెడ్డి గురువారం నిర్వహించారు. అనంతరం పంచాయతీలను కేటాయించి ఉత్తర్వులను అందజేశారు. డీపీఓ కార్యాలయాధికారులు మాలకొండయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ కోతలపై ముందస్తు సమాచారమివ్వండి
నెల్లూరు రూరల్: పారిశ్రామికవాడలు, ఇండస్ట్రియల్ పార్కుల వద్ద విద్యుత్ కోతలు విధించే సమయంలో ముందస్తు సమాచారాన్ని తప్పక ఇవ్వాలని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో గురువారం నిర్వహించిన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సింగిల్ డెస్క్ పోర్టల్లో 2723 దరఖాస్తులు రాగా, అందులో 2432ను ఆమోదించగా, 21ని తిరస్కరించామని, మిగిలినవి పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, లీగల్ మెట్రాలజీ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను మంజూరు చేసేలా చూడాలన్నారు. మెగా ప్రాజెక్టుల ద్వారా 13599.. పెద్ద పరిశ్రమల ద్వారా 5557 మందికి ఉద్యోగావకాశాలను కల్పించామని వెల్లడించారు. అనంతరం వివిధ కంపెనీల ఏర్పాటుకు సంబంధించిన పురోగతిని పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జేసీ కార్తీక్, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం మారుతిప్రసాద్, ఏపీఐఐసీ జెడ్‌ఎం శివకుమార్, ఆర్డీఓలు పావని, అనూష, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
హోరాహోరీగా
ఎడ్ల బండలాగుడు పోటీలు
జలదంకి: వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకొని స్థానిక జానకీ రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద జిల్లా స్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలను బుధవారం నిర్వహించారు. గమళ్లపాళెం రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన పోటీలకు 15 జతల ఎడ్లు హాజరయ్యాయి. నెల్లూరు రూరల్ మండలం పొట్టేపాళేనికి చెందిన లెనిన్ ఎంటర్‌ప్రైజెస్ తరఫున ఎడ్లు 20 నిమిషాల వ్యవధిలో 4652 అడుగుల దూరం బండ లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. అల్లూరు మండలం తూర్పుగోగులపల్లికి చెందిన కృష్ణతేజారెడ్డి ఎడ్లు 4642.. ఆత్మకూరు మండలం గోళ్లపల్లికి చెందిన శ్రీనివాసులురెడ్డి ఎడ్లు 4302.. పొట్టేపాళేనికి చెందిన కేవీఆర్ బుల్స్ తరఫున ఎడ్లు 4263.. లెనిన్ ఎంటర్‌ప్రైజెస్ తరఫున ఎడ్లు 4218 అడుగుల దూరం లాగి తర్వాతి స్థానాల్లో నిలిచాయి. వీరికి వరుసగా రూ.25 వేలు, రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.పది వేలు, రూ.ఐదు వేలను అందజేశారు. పాల్గొన్న ఎడ్లకు ప్రోత్సాహక బహుమతిగా రూ.రెండు వేలను ఇచ్చారు. అన్నదానాన్ని నిర్వహించారు. ఎస్సై లతీఫున్నీసా ఆధ్వర్యంలో బందోబస్తును ఏర్పాటు చేశారు.
వైఎస్సార్సీపీలో
పలువురికి పదవులు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగ జిల్లా అధ్యక్షుడిగా కోవూరు నియోజకవర్గానికి చెందిన శివుని నరసింహులురెడ్డిని నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులను గురువారం విడుదల చేసింది.
● వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వలంటీర్ల విభాగ రాష్ట్ర కార్యదర్శిగా కోవూరు నియోజకవర్గానికి చెందిన కాటంరెడ్డి దినేష్‌రెడ్డిని నియమించారు.

డిజిటల్ అసిస్టెంట్లకు ఉద్యోగోన్నతులు

డిజిటల్ అసిస్టెంట్లకు ఉద్యోగోన్నతులు