
మూడు కార్లకు నిప్పు
కందుకూరు: ఇంటి బయట పార్క్ చేసిన మూడు కార్లకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టిన ఘటన గురువారం ఉదయం పట్టణంలోని సాలిపాళెంలో వెలుగు చూసింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. తూర్పుసాలిపాళేనికి చెందిన నరేష్ అనే యువకుడు ఎలక్ట్రీషియన్ పని చేస్తుంటాడు. బుధవారం విధుల అనంతరం సొంత కారును బయట పార్క్ చేసి ఇంట్లో నిద్రపోయాడు. గుర్తుతెలియని వ్యక్తులు గురువారం వేకువజామున వాహనానికి నిప్పు అంటించారు. అలికిడికి నిద్ర లేచిన నరేష్ బయటకు వచ్చి నీళ్లు చల్లి మంటలు ఆర్పేశాడు. అప్పటికే కారు సగభాగం కాలిపోయింది. అదే సందర్భంలో నరేష్ ఇంటి పక్కనే పార్కు చేసిన మరో రెండు కార్లకు కూడా నిప్పు అంటుకుని స్వల్పంగా కాలిపోయాయి. దీనిపై ఫిర్యాదు అందుకున్న పట్టణ ఎస్సై శివనాగరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.