
స్వస్థలానికి వస్తుండగా..
పూతలపట్టు(యాదమరి): రోడ్డు ప్రమాదంలో తండ్రీకుమారులు మృతిచెందిన ఘటన పూతలపట్టులో చోటుచేసుకుంది. సీఐ కృష్ణమోహన్ కథనం మేరకు.. నెల్లూరుకు చెందిన సుబ్బారాయుడు (60) కుటుంబం చాలా సంవత్సరాల క్రితమే వ్యాపారరీత్యా బెంగళూరులో స్థిరపడింది. ఆయన తన కుమారుడు నాగేంద్ర (30)కు వివాహం చేయాలని సంబంధాలు చూసే ప్రయత్నం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో తమ స్వస్థలానికి సుబ్బరాయుడితోపాటు ఆయన భార్య మంగమ్మ, నాగేంద్ర, కుమార్తె సుభాషిణి, మనవడు లక్కీతో కలిసి గురువారం ఉదయం బెంగళూరు నుంచి కారులో బయలుదేరారు. నాగేంద్ర కారు నడుపుతున్నాడు. అతను నిద్రమత్తులోకి జారుకోవడవంతో బెంగళూరు – తిరుపతి హైవేలోని పూతలపట్టు మండలం గోపాలపురం సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ పాల డెయిరీ వద్ద కల్వర్టును ఢీకొట్టింది. దీంతో నాగేంద్ర కారులోనే మృతిచెందాడు. పక్కసీటులో ఉన్న సుబ్బారాయుడు కల్వర్టు కింద పడి మరణించాడు. వెనుక కూర్చొన్న మంగమ్మ, సుభాషిణి, లక్కీకి తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను బయటకు తీసి 108 అంబులెన్స్‌లో పి.కొత్తకోట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబానికి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. సుభాషిణి ఆస్పత్రిలో తన తండ్రి, తమ్ముడికి ఏమైంది.. వారెక్కడ అని రోదిస్తూ అడగడం పలువురిని కంటతడి పెట్టించింది. మృతులను పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు.
డివైడర్‌ను ఢీకొట్టిన కారు
తండ్రీకుమారుల మృతి
మరో ముగ్గురికి
తీవ్రగాయాలు

స్వస్థలానికి వస్తుండగా..