
ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): కూటమి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, జైళ్లకు పంపించినా భయపడేది లేదని, దుర్మార్గ పాలన, ఆగడాలపై అలుపెరగని పోరాటం చేస్తామని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులతో దాదాపు 86 రోజులు జిల్లా జైల్లో రిమాండ్‌లో ఉన్న కాకాణికి ఇటీవల బెయిల్ మంజూరైన తర్వాత హైకోర్టు విధించిన షరతులు సడలించడంతో శనివారం నెల్లూరు నగరానికి విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో కాకాణి విలేకరులతో మాట్లాడారు. తనకు బెయిల్ వచ్చిన తరువాత అధికారులు చార్జిషీటు ఫైల్ చేసేంత వరకు జిల్లా పరిధిలోకి రావద్దని షరతులు విధించారని, అయితే ప్రతి ఆదివారం పోలీసు కార్యాలయంలో హాజరు కావాలన్న నిబంధన ఉండడంతో హైకోర్టును ఆశ్రయించడంతో తనకు సడలింపునివ్వడంతో ఒక్క రోజు ముందుగానే నెల్లూరుకు వచ్చే అవకాశం కలిగిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 14 నెలల్లో తనపై 14 కేసులు పెట్టారని, నెలకు ఒక్క కేసు నమోదైందన్నారు. తర్వాత ఎన్ని అవుతాయో తెలియదన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తనకు, తన కుటుంబానికి అండగా ఉన్నారని కృతజ్ఞతలు తెలిపారు. అధికారులు సూచించిన హెలిప్యాడ్ ప్రాంతం ప్రమాదకరమని తెలిసినా లెక్క చేయకుండా ఆ హెలిప్యాడ్‌లోనే దిగి తనను, ప్రసన్నను, కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం నింపిన జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ సీఎంను చేసేలా అందరం కష్టపడుతామన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న 10 సీట్లతోపాటు కందుకూరు నియోజకవర్గంతో కలిపి 11 సీట్లు రెండు పార్లమెంట్ స్థానాల్లో వైఎస్‌స్రా్‌సీపీ విజయం సాధించేలా చేస్తామన్నారు. తమను జైల్లో ఉంచిన రోజులే తమ గళం ఆపగలరు తప్ప.. బయట ఉంటే ఆ గళాన్ని ఆపలేరన్నారు. కష్టకాలంలో తన బిడ్డ పూజిత అందరికి ధైర్యంగా నిలిచిందని, ఆ బిడ్డకు అందరి ఆశీస్సు లు ఎల్లవేళలా ఉండాలన్నారు. కష్టకాలంలో ఉన్నటువంటి తమ కుటుంబానికి ఒక జోనల్ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని పూజితకు ఇవ్వడం తమ నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి తమ వారికి ఇచ్చే ప్రాధాన్యతను తెలియజేస్తుందన్నారు. విశ్వాసానికి, విలువలకు ప్రతిరూపం జగన్‌మోహన్‌రెడ్డి అయితే అక్రమాలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అన్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులకు, కార్యకర్తలకు 2029 ఎన్నికల్లో మళ్లీ జగనన్న చెప్పినట్లుగా జగన్ 2.0లో అందరం భుజాలకు ఎత్తుకుని మోయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తనకున్న ఆస్తి సర్వేపల్లి, జిల్లా ప్రజల ప్రేమాభిమానాలేనని, తనపై అక్రమ కేసులు పెట్టి జైల్లో ఉంచినప్పుడు తనకు, తన కుటుంబ సభ్యులకు జిల్లా ప్రజానీకం, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు తమ నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి అండగా ఉన్నారని, అందరికి కృతజ్ఞతలు తెలిపారు.
మళ్లీ జగన్‌ను సీఎం చేస్తాం
కష్టకాలంలో తోడుగా నిలిచిన
వారందరికి ధన్యవాదాలు
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
కాకాణి గోవర్ధన్‌రెడ్డి