
ట్రాఫిక్ నరకం
జానా బెత్తెడు రోడ్లు.. మధ్యలో బారికేడ్లు
నెల్లూరులో ‘ట్రాఫిక్’ ప్రజలకు నరకం చూపిస్తోంది. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని తీసుకుంటున్న అనాలోచిత చర్యలు బూమ్‌రాంగ్ అవుతున్నాయి. మినీబైపాస్ రోడ్డు, విజయమహల్ గేటు రోడ్డు, గేటు నుంచి పొగతోటకు వెళ్లే మార్గాలు జానాబెత్తెడుగా ఉంటాయి. ఈ మార్గాల్లోనే ట్రాఫిక్ కూడా అధికంగా ఉంటుంది. దీనికి తోడు ఆయా రోడ్లల్లో కార్లు పార్కింగ్ చేస్తున్నా.. పట్టించుకోని ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నామనే బిల్డప్ కోసం సర్కిల్స్‌ల్లో డివైడర్లు, రోడ్డు మధ్యలో బారికేడ్లు పెట్టడంతో ఈ సమస్య మరింత జఠిలంగా మారుతోంది. పూలే సెంటర్ పరిస్థితి చూస్తే ఒక పక్క రోడ్డు మీదనే ఆటోలను నిలిపేస్తున్నారు. మరో వైపు దుకాణాలు పెట్టి వ్యాపారాలు చేస్తున్నారు. మరో వైపు ఏకంగా కార్లు, బైక్‌లు రోడ్డు మీదకు పార్కింగ్ చేస్తున్నారు. అడ్డదిడ్డంగా దూసుకువచ్చే ఆటోలు, బైకర్లతో ప్రధాన రహదారులు ట్రాఫిక్ స్తంభించిపోయి పద్మవ్యూహాన్ని తలపిస్తున్నాయి. పూలే సెంటర్ కూడలి ఉన్నప్పటికీ డివైడర్ రాళ్లు పెట్టడంతో బాలాజీనగర్ నుంచి ఆత్మకూరు బస్టాండ్ వైపు వెళ్లాంటే అర కి.మీ. దూరం ముందుకెళ్లి.. తిరిగి అంతే దూరం వెనక్కి రావాల్సిన దుస్థితి ఉంది. ఇక విజయమహల్ గేటు వైపు వెళ్లాలన్నా.. అదే పరిస్థితి. విజయమహల్ రోడ్డు అసలే రద్దీగా ఉంటుంది. విజయమహల్ గేటు రోడ్డు మీదకే తోపుడు బండ్లు ఉండడం, మరో వైపు దుకాణాలకు వచ్చే వాహనాలు పార్కింగ్‌తో కుచించుకుపోయింది. దీంతో ఒక కారు, ఒక బైక్ ఎదురెదురుగా కూడా వెళ్లలేని పరిస్థితి. తాజాగా రామలింగాపురం అండర్ బ్రిడ్జి వద్ద పనులు జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ మొత్తం విజయమహల్ గేటు రోడ్డులోకి మళ్లింది. నిత్యం అత్యంత రద్దీగా ఉండే విజయమహల్ గేటు రోడ్డులో అండర్ బ్రిడ్జిని దాటుకుని పోయే సరికి వాహనచోదకులకు చుక్కలు కనిపిస్తున్నాయి. అసలే జానా బెత్తెడు రోడ్డులో ఇటీవల ట్రాఫిక్ పోలీసులు బారికేడ్లు పెట్టడడంతో పూర్తిగా స్తంభించిపోతోంది. విధులు వదిలేసి కేసులు రాయ డంలో బిజీబిజీగా ఉంటున్నారు. ప్రధానంగా మినీబైపాస్‌లో పూలేబొమ్మ సెంటర్, విజయమహల్ గేటు సెంటర్లలో విధులు నిర్వర్తించే సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ రెండు ప్రాంతాల్లో వాహనాలు అడ్డదిడ్డంగా నడిపేస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నా.. కళ్ల ముందే ట్రాఫిక్ నిలిచిపోయినా తాఫీగా చూస్తున్న పరిస్థితులు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయి.
– సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు

ట్రాఫిక్ నరకం

ట్రాఫిక్ నరకం

ట్రాఫిక్ నరకం