
సింహ వాహనంపై ఊరేగిన వెంకయ్యస్వామి
వెంకటాచలం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గొలగమూడి వెంకయ్యస్వామి 43వ ఆరాధనోత్సవాల్లో భాగంగా శనివారం సింహవాహన సేవ నిర్వహించారు. ఆలయంలో నిత్య పూజలు అనంతరం వెంకయ్యస్వామిని సింహవాహనంపై ఆశీనులను చేసి పూలతో అలంకరించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం ముందు వెంకయ్యస్వామి ఆశ్రమ భజన బృందం కోలాట ప్రదర్శనలు చేశారు. సింహవాహన సేవకు వేమూరు కిషోర్‌కుమార్, నాగవెంకట అరుణలత, వెవెంకటసాయి సాత్విక్ ఉభయకర్తలుగా వ్యవహరించారు.
కనుల పండువగా గరుడ వాహనసేవ
ఆరాధనోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి గరుడ వాహన సేవ నిర్వహించారు. గొలగమూడి వీధుల్లో కనుల పండుగా సాగింది. గరుడవాహన సేవకు నెల్లూరుకు చెందిన బీవీ లక్ష్మి, హేమంత్‌రెడ్డి ఉభయకర్తలుగా వ్యవహరించారు. అనంతరం పలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఉత్సవాలను ఆశ్రమ ఈఓ పి.బాలసుబ్రహ్మణ్యం పర్యవేక్షించారు.
నేడు వెంకయ్యస్వామి ఆరాధనోత్సవం
భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి 43వ ఆరాధన మహోత్సవాలు ఆదివారంతో ముగియనున్నాయి. ఉదయం 10 గంటలకు రథోత్సవం జరగనుంది. రాత్రి 8 గంటలకు కోనేరులో తెప్పోత్సవం కనుల పండువగా సాగనుంది. ఆరాధనోత్సవాల్లో చివరి రోజు కావడంతో భక్తులు వేలాది సంఖ్యలో హాజరు కానుండడంతో ఏర్పాట్లు పూర్తి చేశారు.