
కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించినా నేరమే
సాక్షి, టాస్క్‌ఫోర్స్: బిట్రగుంట పోలీసులు భారతీయ న్యాయసంహితకు కొత్త భాష్యం చెబుతున్నారు. ప్రజాస్వామ్యంలో నిరసనల్లో భాగంగా శాంతియుతంగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించినా నేరమేనంటూ వైఎస్సార్‌సీపీ నాయకులను అక్రమంగా అదుపులోకి తీసుకోవడం శుక్రవారం కలకలం రేపింది. జలదంకి మండలం అన్నవరం క్వారీలో డ్రోన్ ఘటన తర్వాత అధికార పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్ రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేసినా, రోడ్డెక్కి రచ్చ చేసినా కన్నెత్తి చూడని ఖాకీలు, శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించినందుకు వైఎస్సార్‌సీపీ నాయకులను అదుపులోకి తీసుకోవడం, స్పష్టమైన కారణాలు చెప్పకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ మద్దిబోయిన వీరరఘుతోపాటు పలువురు కార్యకర్తలను శుక్రవారం ఉదయమే అదుపులోకి తీసుకున్న పోలీసులు రాత్రి ఏడు గంటల వరకూ విడిచి పెట్టలేదు, అదుపులోకి తీసుకోవడానికి సరైన కారణాలు చూపించలేదు. వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా, రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను భంగ పరిచేలా ఉదయం నుంచి రాత్రి వరకు అక్రమంగా అదుపులో ఉంచుకోవడంతో కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులను అదుపులోకి తీసుకోవడంపై పోలీసులను సంప్రదించగా అనుమతులు లేకుండా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించడంపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
వైఎస్సార్‌సీపీ నేతలకు పోలీసుల నోటీసులు
దగదర్తి: మండలంలో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని ఎటువంటి ర్యాలీలు ధర్నాలు చేపట్టకూడదంటూ మండలంలోని వైఎస్సార్‌సీపీ నేతలకు ముందస్తుగా శుక్రవారం పోలీసులు నోటీసులు అందజేశారు. ఆ పార్టీ మండల కన్వీనర్ వెలినేని మహేష్‌నాయుడు, మండల ఉపాధ్యక్షుడు సీహెచ్ వెంకటేశ్వర్లు, తాళ్లూరి రాజశేఖర్ నాయుడు, తడకలూరు పంచాయతీ సర్పంచ్ ఆత్మకూరు గిరినాయుడుకు పోలీసులు నోటీసులు అందజేశారు. ఇటీవల కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి, సోషల్ మీడియా వ్యక్తులపై అక్రమ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్రమ కేసులకు నిరసనగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు శాంతియుత ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో దగదర్తి మండలంలో నిరసనలు ర్యాలీలు నిర్వహించకుండా ముందస్తుగా పోలీసులు స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలకు నోటీసులు అందజేశారు.