
నాడొకమాట.. నేడు మరోమాట
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తే పగలగొట్టాలని నాడు టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక వాటిని ఏర్పాటు చేస్తున్నారు. నాడొకలా.. నేడు మరోలా వ్యవహరిస్తున్నారు’ అని ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు. నెల్లూరులోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన భవన్‌లో గురువారం వామపక్షాలు, పలు ప్రజాసంఘాల నాయకులు విద్యుత్ స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి అరిగెల నాగేంద్రసాయి, సీపీఐ ఎంఎల్ నాయకుడు రాంబాబు, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్య మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రూ.15,500 కోట్ల భారాన్ని ప్రజలపై వేసిందన్నారు. ప్రజలు వ్యతిరేకిస్తే స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయొద్దని విద్యుత్ శాఖ మంత్రి ఆదేశాలిచ్చినా అదానీ, విద్యుత్ సిబ్బంది దొంగచాటుగా మీటర్లు ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో యూనిట్ విద్యుత్ ధర రూ.2.40లకు కొంటే టీడీపీ గగ్గోలు పెట్టారన్నారు. నేడు అదే యూనిట్ విద్యుత్‌ను రూ.3.60లకు కొంటున్నారన్నారు.
టీడీపీకి రూ.40 కోట్లు
కరేడు గ్రామంలో షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌కు చెందిన ఇండోల్‌సోల్ సోలార్ కంపెనీకి 8,400 ఎకరాల భూమిని అప్పగించేందుకు వారు బాండ్స్ రూపంలో టీడీపీకి రూ.40 కోట్లు అందజేసినట్లు నేతలు ఆరోపించారు. స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసి సింగిల్‌ఫేజ్ విద్యుత్ వినియోగదారుల నుంచి రూ.9 వేలు, త్రీఫేజ్ వినియోగదారుల నుంచి రూ.14 వేలు వసూలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధపడిందన్నారు. కూటమి ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ చేసే పోరాటాలకు పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు ఇస్తున్నాయన్నారు. రాబోయే కాలంలో ప్రజల నుంచి సంతకాల సేకరణ, సదస్సులు, సభలు నిర్వహిస్తామన్నారు. నాయకులు మాదాల వెంకటేశ్వర్లు, ప్రసాద్, పుల్లయ్య, శ్రీరాములు, వెంకమరాజు, షాన్‌వాజ్ పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వంపై
మండిపడిన నేతలు
ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం