
పాలనను గాలికొదిలి.. కక్షసాధింపులకే పరిమితం
● వైఎస్సార్సీపీ రీజినల్
కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు
● అక్రమ కేసులపై డీఎస్పీకి
వినతిపత్రం అందజేత
నెల్లూరు(క్రైమ్): పాలనను కూటమి ప్రభుత్వం గాలికొదిలి.. తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. పార్టీ నేతలపై జిల్లాలో అక్రమ కేసులు బనాయిస్తున్న విషయమై ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు గానూ జిల్లా పోలీస్ కార్యాలయానికి కారుమూరితో పాటు పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, వెంకటగిరి, నెల్లూరు రూరల్, సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్తలు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, ఆనం విజయకుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య గురువారం వచ్చారు. ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో డీటీసీ డీఎస్పీ గిరిధర్‌రావుకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కారుమూరి మాట్లాడారు. తమ పార్టీ నేతలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, ఇందులో భాగంగానే అక్రమ కేసులు, అరెస్ట్‌లను కొనసాగిస్తోందని ఆరోపించారు. తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల చేపట్టిన జిల్లా పర్యటనలో పార్టీ నేతలను ఇబ్బంది పెట్టేందుకు పన్నిన కుట్రలు అందరికీ తెలిసినవేనన్నారు. ఆయన్ను కలిసేందుకు వేలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణులపై అక్రమ కేసులను బనాయించారని మండిపడ్డారు. ప్రశాంతమైన జిల్లాలో కక్షపూరిత రాజకీయాలకు టీడీపీ పాల్పడుతోందని ధ్వజమెత్తారు.
టీడీపీ నేతల చేతుల్లో కీలుబొమ్మలు
కూటమి పెద్దలు సూచించిన తమ పార్టీ నేతల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసి జైళ్లకు పంపుతున్నారని చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు. టీడీపీ నేతల చేతుల్లో పోలీస్ శాఖ కీలుబొమ్మలా మారిందని విమర్శించారు. జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు పర్యటన సందర్భంగా తమ పార్టీ నేతలపై పోలీసులు లాఠీచార్జి చేసి కిందపడేసి.. తిరిగి వారిపైనే కేసులు బనాయించడం సిగ్గుచేటని విమర్శించారు. కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిపై హత్యాయత్నం కేసును నమోదు చేయడం దారుణమన్నారు. మాజీ మంత్రులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్ ఇలా ప్రతి ఒక్కరిపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. తమపైనా ఎక్కడ కేసులు పెడతారోనని ప్రజలు భయపడుతున్నారని తెలిపారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం, పోలీసులు తమ తీరును మార్చుకోవాలని హితవు పలికారు.