
పోర్టు ఆధారిత పరిశ్రమలతో ఉపాధి
● కలెక్టర్ ఆనంద్
కందుకూరు: రామాయపట్నం పోర్టు ఆధారంగా ఏర్పడుతున్న పరిశ్రమలతో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. గుడ్లూరు మండలం చేవూరు పరిధిలో ఏర్పాటైన ఇండోసోల్ కంపెనీలో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పిస్తూ నియామక పత్రాలను బుధవారం అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. రామాయపట్నం పోర్టు ఆధారిత పరిశ్రమలకు భూములిచ్చిన రైతు కుటుంబాల్లోని యువతకు ఉద్యోగాలు కల్పించి వారికి అండగా ఉంటున్నామని తెలిపారు. ఇండోసోల్, బీపీసీఎల్ కంపెనీల ఏర్పాటుతో స్థానికులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభించనున్నాయని వెల్లడించారు. ఇండోసోల్ కంపెనీలో 68 మందికి ఉద్యోగాలను ప్రస్తుతం కల్పిస్తున్నారని తెలిపారు. ఇతరులకు సైతం వారి విద్యార్హత ఆధారంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగాలను కల్పించనున్నామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడారు. కాకినాడ, విశాఖపట్నం పోర్టుల తరహాలో రామాయపట్నం పోర్టూ అభివృద్ధి చెందుతుందని చెప్పారు.
ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి
ఇండోసోల్ కంపెనీలో ఉద్యోగాల కోసం అర్హత గల యువత దరఖాస్తు చేసుకోవాలని, వీటిని కంపెనీ కార్యాలయం లేదా ఈ మెయిల్‌కు పంపొచ్చని సంస్థ హెచ్‌ఆర్ ప్రతినిధి, కంపెనీ స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి భారతి పేర్కొన్నారు. అభ్యర్థుల అర్హతల మేరకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలను కల్పిస్తామని, శిక్షణ కార్యక్రమాలను సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. సబ్ కలెక్టర్ దామెర హిమవంశీ, ఇండోసోల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బాలచందర్‌కృష్ణన్, బైరెడ్డి రంగారెడ్డి, స్కిల్ డెవలప్‌మెంట్ జిల్లా అధికారి అబ్దుల్ ఖయ్యూం తదితరులు పాల్గొన్నారు.