
నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు
చంపేస్తారేమో.. భయంగా ఉంది
కారు డిక్కీలోంచి అరుణ సెల్ఫీ వీడియో
సిఫార్సు లేఖ ఇచ్చింది నిజమేనన్న గూడూరు ఎమ్మెల్యే
శ్రీకాంత్‌కు పెరోల్ కోసం హోం శాఖలో ముఖ్యులొకరికి రూ.2 కోట్లు
సాక్షి టాస్క్‌ఫోర్స్: నెల్లూరు సెంట్రల్ జైల్లో జీవిత ఖైదీగా ఉన్న శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం గుట్టు రట్టు కాకుండా అత్యవసరంగా ఈ ఎపిసోడ్‌కు ఫుల్ స్టాప్ పెట్టడంలో భాగంగా శ్రీకాంత్ సన్నిహితురాలు నిడిగంటి అరుణను ప్రభుత్వం ఆగమేఘాలపై అరెస్ట్ చేయించింది. కోవూరులో బిల్డర్ నుంచి అపార్ట్‌మెంట్ కొనుగోలు వ్యవహారంలో అరుణ.. శ్రీకాంత్ స్నేహితులను అడ్డుపెట్టుకుని బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించేందుకు ప్రయత్నించిందని మూడేళ్ల క్రితం ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పుడు కేసు నమోదు చేయించింది.
హైదరాబాద్‌కు వెళ్తున్న ఆమెను బాపట్ల జిల్లా అద్దంకిలో పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో ఒంగోలు జైలుకు తరలించారు. అంతకు ముందు అరుణను అరెస్ట్ చేసిన పోలీసులు ఆమెను కారు డిక్కీలో వేశారు. ‘నన్ను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు. నా కారులో గంజాయి పెట్టాలని నా కారు డ్రైవర్‌కు చెబుతున్నారు. నన్ను అక్రమంగా నిర్బంధించారు. నాపై ఏమేమి కేసులు పెడుతున్నారు? నేను చేసిన తప్పేంటి? నన్ను చంపుతారేమోనని భయంగా ఉంది. మీడియా నన్ను కాపాడాలి’ అంటూ డిక్కీలోంచి సెల్ఫీ వీడియో తీసి బయటకు పంపింది. ఈ వీడియో వైరల్ కావడంతో ప్రభుత్వ పెద్దలు బెంబేలెత్తుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమెపై మరిన్ని కేసులు నమోదు చేసి.. ఇప్పుడప్పుడే బయటకు రాకుండా చేసేందుకు పోలీస్ శాఖ ప్రయత్నిస్తోంది.
అవును.. సిఫార్సు లేఖ ఇచ్చాను
జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్ పెరోల్‌కు తాను సిఫార్సు లేఖ ఇచ్చింది నిజమేనని గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ బుధవారం విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. జైలులో శిక్ష అనుభవిస్తున్న తన కుమారుడిని చూడాలని ఉందంటూ తనకు ప్రజా విజ్ఞప్తుల్లో ఓ మహిళ వినతి పత్రం ఇచ్చారన్నారు. ఆ తర్వాత పెరోల్ రద్దు కావడం తెలిసిందేనని చెప్పారు. ఈ క్రమంలో ఇటీవల తాను నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నివాసానికి వెళ్లిన సమయంలో అక్కడ అరుణ అనే మహిళ ఉందని, దీనిని ఆసరాగా చేసుకుని పెరోల్‌కు తామే సహకరించినట్లు ఆరోపణలు చేయడం సబబు కాదన్నారు. పెరోల్ రద్దుతో వివాదం సమసిపోయిందన్నారు.
రూ.2 కోట్లు ఎవరికి ఇచ్చినట్లు?
శ్రీకాంత్ 2014లో టీడీపీ హయాంలో జైలు నుంచి తప్పించుకుని నాలుగేళ్ల పాటు డాన్‌గా ఎదిగాడు. వంద మందికి పైగా రౌడీషీటర్లను సైనికుల్లా పెట్టుకుని టీడీపీ ఎమ్మెల్యేల సహకారంతో నెల్లూరులో సెటిల్‌మెంట్లు, దందాలు, హత్యాకాండలు సాగించాడు. నాలుగేళ్ల తర్వాత స్వచ్ఛందంగా లొంగిపోయాక కూడా అదే తరహాలో జైలు నుంచే అన్ని కార్యక్రమాలు నిర్వహించాడు. ఇవన్నీ తెలిసి కూడా కూటమి ప్రభుత్వం అతడికి పెరోల్ మంజూరు చేసి.. అతని నేరాలకు రాచబాట వేసింది. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పెరోల్‌ను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో తమను వాడుకుని వదిలేశారని, అందరి గుట్టు విప్పుతానని శ్రీకాంత్ సన్నిహితురాలు అరుణ పెట్టిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీంతో పెరోల్ వెనుక అసలు గుట్టుతోపాటు అతని నేర చరిత్రలో భాగస్వాములుగా ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రుల అసలు రంగు బయట పడుతుందని ప్రభుత్వం బెంబేలెత్తిపోయి హడావుడిగా ఆమెను అరెస్ట్ చేయించింది. కాగా, పెరోల్ కోసం హోం శాఖలో ముఖ్యులొకరికి అరుణ రూ.2 కోట్లు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతకూ ఆ డబ్బును ఎవరు తీసుకున్నారో విచారణలో తేలుస్తారా?
ముగ్గురు ఏఆర్ కానిస్టేబుళ్ల సస్పెన్షన్
జీవిత ఖైదీ శ్రీకాంత్ హాస్పిటల్‌లో ఉన్న సమయంలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు ఏఆర్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ ఎస్పీ జీ కృష్ణకాంత్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది డిసెంబర్‌లో శ్రీకాంత్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో చేరారు. నెల రోజులకు పైగా అయన హాస్పిటల్లో ఉన్నారు. ఆ సమయంలో సన్నిహితురాలు అరుణతో మసాజ్ చేయించుకుంటూ, డ్యాన్స్‌లు చేసిన వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించడంతో దీనిపై విచారణ జరిపిన ఎస్పీ.. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న ఏఆర్ కానిస్టేబుళ్లు సుబ్బారావు, ఖాజా మొహిద్దీన్, ఖలీల్‌ను విధుల నుంచి తొలగించారు. శ్రీకాంత్, అరుణ వ్యవహారంలో ఇంకా ఎవరెవరు వారికి సహకరించారో ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.