
పెళ్లి రోజే చివరి రోజు
మనుబోలు: వివాహ వేడుక నిమిత్తం స్వగ్రామానికి వచ్చి వారం పాటు సరదాగా గడిపారు. సెకండ్ షో సినిమాకు వెళ్లి సేదదీరారు. తమ పెళ్లి రోజు సందర్భంగా తిరిగి ఉద్యోగం చేస్తున్న ప్రాంతానికి వెళ్తున్న ఓ కుటుంబంపై విధి పగబట్టింది. మృత్యువు రోడ్డు ప్రమాద రూపంలో కబళించింది. ఈ ఘటనతో మండలంలోని వడ్లపూడిలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన దద్దోలు పెంచలయ్య, జయమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడు సురేశ్ కరీంనగర్‌లోని ఓ గ్రానైట్ కంపెనీలో మార్కర్‌గా పనిచేస్తూ కుటుంబంతో కలిసి అక్కడే నివాసముంటున్నారు. వారం క్రితం బంధువుల పెళ్లి ఉండటంతో సురేశ్ దివ్య (32) దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి వడ్లపూడికి వచ్చారు. కుటుంబసభ్యులు, బంధువులతో సరదాగా గడిపి.. పొదలకూరులో సెకండ్ షో సినిమాకు మంగళవారం వెళ్లారు. బుధవారం వారి పెళ్లి రోజు కావడంతో వేకువజామునే కారులో బయల్దేరారు. నిద్రమత్తులో కల్వర్టును వాహనం ఢీకొనడంతో తెలంగాణలోని జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం వడిచర్ల వద్ద వీరు మృత్యువాత పడ్డారు. ఘటనతో వడ్లపూడి విషాదంలో మునిగిపోయింది. తమ ముందు సంతోషంగా తిరిగిన జంట ఇక లేరని తెలిసి ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమవుతున్నారు.