
పోలీసుల స్పెషల్ డ్రైవ్
● నిబంధనల ఉల్లంఘనులకు భారీగా జరిమానాలు
నెల్లూరు(క్రైమ్): రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. గురువారం రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు వాహన తనిఖీలు చేపట్టారు. నిబంధనల ఉల్లంఘనులపై కొరడా ఝళిపించారు. మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతున్న 100 మందిపై కేసులు నమోదు చేసి రూ.1,06,500లు జరిమానా విధించారు. అదేక్రమంలో నేర నియంత్రణ చర్యల్లో భాగంగా జిల్లాలోని 54 లాడ్జీలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బస చేసిన వారిని ఎక్కడి నుంచి వచ్చారు?, ఎందుకు వచ్చారు?, ఏం చేస్తున్నారు తదితర వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ జి.కృష్ణకాంత్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. అందులో భాగంగా వాహన తనిఖీలు ముమ్మరం చేశామన్నారు. మితిమిరీన వేగం, ట్రిపుల్, మైనర్ రైడింగ్, ఓవర్‌లోడ్, డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్‌కు పాల్పడుతున్న వాహనచోదకులపై కేసులు నమోదుచేసి భారీగా జరిమానాలు విధిస్తున్నామన్నారు. వాహనచోదకులు విధిగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. స్పెషల్ డ్రైవ్‌లో జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పోలీసుల స్పెషల్ డ్రైవ్