
‘నాన్నా.. నేనిక బతకను’
● రోడ్డు ప్రమాదంలో
గాయపడిన కుమారుడు
● తండ్రి 108 పైలట్
● అంబులెన్స్‌లో తీసుకెళ్తుండగా మృతి
● మైనర్ బాలుడి నిర్వాకం
పొదలకూరు: ఆ యువకుడు కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉన్నాడు. ఇంతలో రోడ్డు ప్రమాదం జరిగింది. 108 పైలట్‌గా వెళ్తున్న తండ్రి కుమారుడిని తన అంబులెన్స్‌లో తరలిస్తుండగా తుదిశ్వాస విడిచిన హృదయ విషాదరక ఘటన గురువారం రాత్రి మరుపూరు వద్ద జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. పొదలకూరు శింగయ్య చేనువీధికి చెందిన మందాటి సురేష్ ఆదూరుపల్లి 108 అంబులెన్స్ పైలట్. ఎంతో మంది ప్రాణాలను కాపాడాడు. ఆయన పెద్ద కుమారుడు మందాటి బాలసు బ్రహ్మణ్యం (20) సొంతంగా కారు నడుపుతూ కుటుంబానికి అండగా ఉన్నాడు. చిన్న కుమారుడు చదువుకుంటున్నాడు. గురువారం రాత్రి బాలసుబ్రహ్మణ్యం తన కారులో నెల్లూరుకు డ్రాపింగ్‌కు వెళ్లి తిరిగి వస్తున్నాడు. సురేష్ ఒకరిని నెల్లూరు ఆస్పత్రిలో చేర్చి వస్తూ కుమారుడి కారును చూశాడు. అంబులెన్స్, కారు పొదలకూరుకు బయలుదేరాయి. డక్కిలి మండలం వెలికల్లు గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలుడు నెల్లూరు వైపు అతి వేగంగా కారులో వెళ్తున్నాడు. సురేష్ అంబులెన్స్‌ను బాలుడి కారు ఢీకొనే క్రమంలో ప్రమాదం తప్పింది. తన కుమారుడి కారు వెనుక వస్తున్నందున సురేష్ వెంటనే ఫోన్ చేశాడు. అతను లిఫ్ట్ చేయకపోవడంతో మళ్లీ చేశాడు. మరో యువకుడు ఫోన్ లిఫ్ట్ చేసి కారు ప్రమాదం జరిగినట్లు చెప్పాడు. సురేష్ వెంటనే అంబులెన్స్‌ను వెనక్కు తిప్పి ఘటనా స్థలానికి వెళ్లాడు. మరుపూరుకు సమీపంలో మద్యం తాగి అతివేగంగా వెళుతున్న బాలుడు బాలసుబ్రహ్మణ్యం కారును ఢీకొనడంతో దెబ్బతింది. తీవ్రంగా గాయపడిన కుమారుడిని సురేష్ నెల్లూరుకు తరలిస్తూ డైకస్ రోడ్డు వద్దకు చేరుకున్నారు. బాలసుబ్రహ్మణ్యం తన తండ్రితో ‘నాన్నా నేను ఇక బతకను’ అంటూ తుదిశ్వాస విడిచాడు. మైనర్‌కు ప్రమాదంలో రెండు కాళ్లు విరిగిపోయాయి. క్షతగాత్రుడిని పొదలకూరు పోలీసులు జీజీహెచ్‌కు తరలించారు. ఎస్సై హనీఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.