
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో దుకాణం దగ్ధం
● రూ.20 లక్షల ఆస్తి నష్టం ● లబోదిబోమంటున్న బాధితులు
వింజమూరు(ఉదయగిరి): విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఆటో స్పేర్స్ దుకాణం దగ్ధమైంది. ఈ ఘటన వింజమూరు పట్టణంలోని జెడ్పీహెచ్‌ఎస్ సమీపంలో జరిగింది. స్థానికులు, బాధితుల కథనం మేరకు.. బుజ్జమ్మ కొన్ని సంవత్సరాలుగా ఆటో స్పేర్స్, వివిధ రకాల వాహనాలకు సీటు కవర్లు, ఆయిల్ విక్రయిన్నారు. ఇటీవల భారీగా సరుకు నిల్వ ఉంచారు. శుక్రవారం ఉదయం దుకాణంలో ఉన్న ఒక గదిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు వ్యాపించాయి. మొత్తం సామగ్రి కాలిపోయింది. స్థానికులు గమనించి ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వగా వారొచ్చి మంటలు ఆర్పారు. దీంతో చుట్టుపక్కల దుకాణాలకు మంటలు వ్యాపించలేదు. సుమారు రూ.20 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోతున్నారు.
రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
నెల్లూరు(క్రైమ్): ఏం కష్టమొచ్చిందో తెలియదు గానీ రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని రైలు కొద్దిదూరం లాక్కెళ్లడంతో ఛిద్రమై గుర్తుపట్టలేని విధంగా తయారైంది. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున మాగుంట లేఅవుట్ అండర్‌బ్రిడ్జి సమీపంలో నెల్లూరు వైపు వచ్చే పట్టాలపై చోటుచేసుకుంది. మృతుడి వయసు సుమారు 40 నుంచి 45 ఏళ్లలోపు ఉండొచ్చు. తెలుపు, గులాబీ రంగులు మిళితమైన హాఫ్ హ్యాండ్స్ చొక్కా, నలుపు రంగు జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. సమాచారం అందుకున్న నెల్లూరు రైల్వే ఎస్సై ఎన్.హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు.
● జారిపడి..
గుర్తుతెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు రైల్లో నుంచి జారిపడిన ఘటన శుక్రవారం బుజబుజనెల్లూరు సమీపంలో నెల్లూరువైపు వచ్చే పట్టాలపై చోటుచేసుకుంది. అతడిని రైల్వే ట్రాక్‌మెన్ జి.భార్గవ్‌బాబు 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందాడని నిర్ధారించారు. మృతుడు నలుపు రంగు ఫుల్‌హ్యాండ్స్ టీషర్టు, నలుపు రంగు నైట్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. సమాచారం అందుకున్న రైల్వే ఎస్సై ఎన్.హరిచందన హాస్పిటల్‌కు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేశారు.