
ప్రయాణికుడి ముసుగులో నేరాలు
నెల్లూరు(క్రైమ్): ప్రయాణికుడి ముసుగులో రైళ్లలో నేరాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నేరగాడిని నెల్లూరు రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం నెల్లూరు రైల్వే డీఎస్పీ జి.మురళీధర్ స్థానిక కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. నెల్లూరు రైల్వే సీఐ ఎ.సుధాకర్ తన సిబ్బంది, ఆర్ఫీఎఫ్ ఇన్‌స్పెక్టర్‌లు పి.రమేష్‌గౌడ్, హజరిలాల్ గుర్జార్‌తో కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రైళ్లు, రైల్వేస్టేషన్లలో నేరాల నియంత్రణ, మత్తు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కట్టడిలో భాగంగా నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఆ బృందాలు నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్‌లో తనిఖీలు చేపట్టాయి. జనశతాబ్ది రైలు దిగి అనుమానాస్పదంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన కె.గోవర్ధన్ అలియాస్ కార్తీక్ అర్వింద్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు. కావలి, నెల్లూరు, గూడూరు ప్రాంతాల్లో రైళ్లలో చోరీలకు పాల్పడినట్లు వెల్లడించాడు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి రూ.12 లక్షల విలువైన 143 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు ల్యాప్‌టాప్‌లను స్వాధీ నం చేసుకున్నారు.
చిన్నతనం నుంచే..
నిందితుడు చిన్నతనం నుంచే వ్యసనాలకు బానిసై సులభ మార్గంలో నగదు సంపాదించేందుకు రైళ్లలో ప్రయాణికరుని ముసుగులో చోరీలకు పాల్పడసాగాడు. జనరల్ టికెట్ తీసుకుని దివ్యాంగులు, జనరల్ బోగిల్లో ఎక్కేవాడు. అదును చూసి ఏసీ బోగిల్లోకి వెళ్లి నిద్రిస్తున్న ప్రయాణికుల నగల బ్యాగ్‌లు, ల్యాప్‌టాప్‌లను చోరీ చేసేవాడు. అతనిపై హైదరాబాద్‌తోపాటు నంద్యాల, కర్నూలు, విజయవాడ, తిరుపతిల్లో కేసులున్నాయి. నిదితుడిని అరెస్ట్ చేయడంలో ప్రతిభ చూపిన సీఐ, ఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్లు, నెల్లూరు, గూడూరు రైల్వే ఎస్సైలు హరిచందన, చెన్నకేశవ, సిబ్బంది దయాకర్, మణికంఠ, కిరణ్ తదితరులను డీఎస్పీ అభినందించారు.
అంతర్రాష్ట్ర నేరగాడి అరెస్ట్
రూ.12 లక్షల సొత్తు స్వాధీనం