
మద్దతు ధరకు ధాన్యం కొనాలి
● జేసీ కార్తీక్‌ను కోరిన రైతు సంఘాల
నాయకులు
నెల్లూరు(అర్బన్): జిల్లాలో ఎడగారు వరి పంటకు సంబంధించి ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతు సంఘాల నాయకులు జేసీ కార్తీక్‌ను కోరారు. బుధవారం జేసీ అన్ని పార్టీల రైతు సంఘాల నాయకులు, మిల్లర్ల అసోసియేషన్ నాయకులు, అధికారులతో నెల్లూరు కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సీజన్‌లో ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రాలేదని, రైతు నష్టపోకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలపాలని ఆయన కోరారు. దీంతో రైతు సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు చిరసాని కోటిరెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం కూడా ప్రభుత్వం తూతూమంత్రంగా చర్యలు చేపట్టిందన్నారు. కేవలం లక్ష టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసి చేతులు దులుపుకొందన్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రస్తుతం జిల్లాలో పండిస్తున్న కేఎన్‌ఎం 733, ఎంటీయూ 1010 లాంటి రకాలన్ని కూడా ఏ–గ్రేడ్‌కు చెందినవేనన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పుట్టి రూ.19,770కు మిల్లర్లు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. వర్షాలు కురుస్తున్నాయని, ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు కూడా సమయం లేదని వివరించారు. ఈ సాకుతో మిల్లర్లు మద్దతు ధర తగ్గించకుండా ఉండేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. సాగు ఖర్చు ఈ ఏడాది 20 శాతం అదనంగా పెరిగిందన్నారు. ప్రభుత్వం మాత్రం 3 శాతమే మద్దతు ధర పెంచిందన్నారు. ఈ స్థితిలో రైతులు నష్టపోతున్నారన్నారు. ఇంకా నష్టపోకుండా ఉండాలంటే ప్రస్తుత మద్దతు ధరకు మిల్లర్లు కొనుగోలు చేయాల్సిందేనని తెలిపారు. ఇదే విషయాన్ని ఏకగ్రీవంగా ఇతర నాయకులు కూడా తెలిపారు. దీంతో జేసీ స్పందిస్తూ మిల్లర్లకు తగిన ఆదేశాలు జారీ చేస్తామన్నారు. కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు చండ్ర రాజగోపాల్, మూలె వెంగయ్య, శ్రీనివాసులు, రమణయ్య, వ్యవసాయ శాఖ జేడీ సత్యవాణి తదితరులు పాల్గొన్నారు.
పాల్గొన్న
నాయకులు, అధికారులు

మద్దతు ధరకు ధాన్యం కొనాలి