విషాద ప్రయాణం | - | Sakshi
Sakshi News home page

విషాద ప్రయాణం

Aug 10 2025 8:19 AM | Updated on Aug 10 2025 8:19 AM

విషాద

విషాద ప్రయాణం

ఉలవపాడు: బాలుడికి తిరుమలలో పుట్టు వెంట్రుకలు తీయించి.. దైవ దర్శనం చేసుకుని సంతోషంగా సొంతూరికి చేరుకోవాలని ఆ కుటుంబం అనుకుంది. అన్ని ఏర్పాట్లు చేసుకుని తుఫాన్‌ వాహనంలో బయలుదేరింది. అయితే విధి మరోలా తలచింది. మృత్యు ప్రయాణంగా మారడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఉలవపాడు దాటి చాగల్లు సమీపంలోకి వచ్చే సమయంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్తగణేశునిపాడుకు చెందిన ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. ఆస్పత్రికి తరలిస్తుండగా ఒకరు, శనివారం వైద్యశాలలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతిచెందారు.

ఇద్దరూ సచివాలయ ఉద్యోగులు

చిన వెంకటేశ్వర్లు సుభాషిణిలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ కష్టపడి సచివాలయంలో ఉద్యోగాలు సాధించారు. వెంకటేశ్వర్లు పిడుగురాళ్లలో వెల్ఫేర్‌ అసిస్టెంట్‌గా, సుభాషిణి డిజిటల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. మూడేళ్ల కుమారుడితో జీవితం సంతోషంగా సాగుతున్న సమయంలో రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాన్ని కకావికలం చేసింది. వెంకటేశ్వర్లు తన భార్యను, తల్లి వెంకటనరసమ్మ, కుమారుడు తేజస్విని అభినయకృష్ణను పోగొట్టుకున్నాడు. దైవదర్శనం కోసం వారితోపాటు వెళ్తూ సుభాషిణి తండ్రి యర్రం శ్రీనివాసరావు ప్రాణాలు కోల్పోయాడు. వెంకటేశ్వర్లు అన్న శ్రీనివాసరావు భార్య రుక్మిణమ్మ మరణించడంతో ఆ కుటుంబంలో అంతులేని విషాదం నెలకొంది.

రైల్లో వెళ్లాలని అనుకుని..

ఆ కుటుంబం తొలుత తిరుపతికి రైలులో వెళ్లాలనుకుని ప్లాన్‌ చేసుకుంది. అందులో ప్రయాణం ప్రశాంతంగా ఉంటుందని శ్రీనివాసరావు అన్నాడు. చిన్నపిల్లలు రైలులో ఇబ్బందులు పడతారు, కారులో అయితే ప్రశాంతంగా పడుకుని నిద్రపోతారు కదా అని వెంకటేశ్వర్లు అనడంతో పిడుగురాళ్లకు చెందిన గంగరాజు అనే వ్యక్తికి సంబంధించిన తుఫాన్‌ వాహనాన్ని బాడుగకు మాట్లాడుకున్నారు. శుక్రవారం రాత్రి 9 గంటలకు బయలుదేరి మధ్యలో టీ తాగేందుకు ఆగారు. తిరిగి బయలుదేరిన అరగంటలోపే ప్రమాదం జరిగిందని శ్రీనివాసరావు తెలిపారు.

మృతదేహాల అప్పగింత

ఉలవపాడు సీహెచ్‌సీలో వెంకటనరసమ్మ, సుభాషిణితోపాటు బాలుడు అభినయ్‌కృష్ణకు శనివారం పోస్టుమార్టం నిర్వహించారు. గ్రామం నుంచి బంధువులు వచ్చి మృతదేహాలను చూసి చలించిపోయారు. నెల్లూరులో యర్రం శ్రీనివాసరావు మృతదేహానికి పోస్టుమార్టం జరిగింది. రుక్మిణమ్మ గుంటూరులో సాయంత్రం చికిత్స పొందుతూ మృతిచెందింది. ఇంకా పోస్టుమార్టం నిర్వహించలేదు. ఉలవపాడు వైద్యశాలలో వారి బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.

పెరిగిన రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య

తొలుత తిరుపతికి రైల్లో

వెళ్లాలని అనుకుని..

తుఫాన్‌ వాహనంలో బయలుదేరి

అనంతలోకాలకు..

విషాద ప్రయాణం 1
1/3

విషాద ప్రయాణం

విషాద ప్రయాణం 2
2/3

విషాద ప్రయాణం

విషాద ప్రయాణం 3
3/3

విషాద ప్రయాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement