
రైలు కిందపడి వ్యక్తి బలవన్మరణం
నెల్లూరు(క్రైమ్): ఏం కష్టమొచ్చిందో తెలియదు గానీ గుర్తుతెలియని వ్యక్తి కల్లూరుపల్లి హౌసింగ్‌బోర్డు సమీపంలో శనివారం వందేభారత్ (తిరుపతి – సికింద్రాబాద్) రైలు కింద పడి బలవ్మనరణం చెందాడు. మృతదేహం రైలు ముందు భాగంలో ఇరుక్కుపోవడంతో నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్ వరకు ఈడ్చుకెళ్లింది. అక్కడ సిబ్బంది మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి వయసు 50 నుంచి 55 సంవత్సరాల్లోపు ఉంటుంది. పచ్చరంగు గీతల హాఫ్ హ్యాండ్స్ టీషర్ట్, నలుపు రంగు గళ్ల లుంగీ ధరించి ఉన్నాడు. సమాచారం అందుకున్న నెల్లూరు రైల్వే ఎస్సై ఎన్.హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం గుర్తుపట్టలేని విధంగా తయారైంది. జీజీహెచ్ మార్చురీకి తరలించి ఎస్సై కేసు నమోదు చేశారు.
కోడిపందేలపై దాడులు
నెల్లూరు సిటీ: రూరల్ పరిధిలోని దొరతోపుకాలనీ సమీప పొలంలో శనివారం కొందరు వ్యక్తులు కోడిపందేలు నిర్వహిస్తుండగా రూరల్ పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసులను చూసిన పలువురు పరారయ్యారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారి నుంచి రెండు కోళ్లు, 15 బైక్‌లు, రూ.23 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.