
నెలకు 913 టన్నుల బియ్యం పక్కదారి
పేదలకు చేరాల్సిన బియ్యం పచ్చ మాఫియాలకు వ్యాపారంగా మారింది. ఎమ్మెల్యేలు, మంత్రుల కనుసన్నల్లో పచ్చనేతల రేషన్ బియ్యం దందా ఆకాశమే హద్దుగా సాగుతోంది. అధికారుల అండదండలతో గోదాముల నుంచే దోపిడీకి తెరతీస్తున్నారు. రాత్రివేళల్లో టన్నుల కొద్దీ బియ్యం మిల్లులకు తరలిపోతున్నా.. ప్రతి నెలా రూ.కోట్లు చేతులు మారుతున్నా సివిల్ సప్లయీస్, పోలీస్, విజిలెన్స్ శాఖలు పచ్చ మాఫియా బియ్యం బండ్లకు పచ్చజెండా ఊపుతున్నారు. రేషన్ బియ్యానికి పాలిష్ పట్టి.. బ్రాండెడ్ బ్యాగుల్లో ప్యాకింగ్ చేసి మార్కెట్లో అత్యధిక ధరలకు విక్రయాలు చేస్తున్నారు. రేషన్ బియ్యాన్ని పాలిష్ పట్టించడం కోసమే నెల్లూరు, కోవూరు, కావలి, కందుకూరుల్లో ప్రత్యేకంగా రైస్ మిల్లులు ఉన్నాయి.
● ఎమ్మెల్యేలు, మంత్రుల కనుసన్నల్లో వ్యాపారం
● ఇందు కోసమే ప్రత్యేకంగా
కొన్ని మిల్లులు
● ఆ విషయం తెలిసినా సివిల్ సప్లయీస్, విజిలెన్స్ పట్టించుకోని వైనం
● ప్రతి నెలా 70 శాతం బియ్యం ఇతర రాష్ట్రాలకు, దేశాలకు అక్రమ రవాణా
● పాలిష్ పట్టి అధిక ధరలకు విక్రయం
● స్థానికులు సమాచారంతో పట్టుకున్నా నిబంధనలకు విరుద్ధంగా
సీఎస్ డీటీలే రిలీజ్
● జేసీ అధికారాలను
లాగేసుకుంటున్న సీఎస్ డీటీలు
సాక్షి, టాస్క్‌ఫోర్స్: సర్వేపల్లి నియోజకవర్గంలోని 205 రేషన్ షాపుల ద్వారా బియ్యం అక్రమ రవాణా నిరాటంకంగా జరుగుతూనే ఉంది. 91,371 మంది కార్డు హోల్డర్లలో కొందరు నేరుగా రేషన్ షాపుల డీలర్లకే అమ్ముకుని నగదు తీసుకుంటున్నారని సమాచారం. మరికొందరు ఆటోల్లో ఇళ్లకు వచ్చి బియ్యం కొనుగోలు చేసే వారికి అమ్ముకుంటున్నారు. డీలర్లు కిలోకు రూ.12 ఇస్తుండగా, ఇళ్లకు వచ్చి సేకరించే వారు రూ.15 కొనుగోలు చేస్తున్నారు. పొదలకూరు చుట్టు పక్కల ప్రాంతాల్లో రేషన్ బియ్యం కొనుగోలు చేసేందుకు ఓ ఏజెంట్ ఉన్నాడు. ఆయనకే డీలర్లు తాము సేకరించిన బియ్యాన్ని అందజేయాల్సి ఉంటుంది. తోటపల్లిగూడూరు, ముత్తుకూరు పరిసర ప్రాంతాల్లో మరికొందరు ఏజెంట్లు ఉన్నారు. మనుబోలు, వెంకటాచలం మండలాల నుంచి రేషన్ బియ్యం సేకరించేందుకు నెల్లూరు చెందిన ఏజెంట్లు వస్తున్నట్లు తెలిసింది. ప్రతినెలా సగటున 913 టన్నుల బియ్యం పక్కదారి పడుతున్నట్లు ప్రచారం ఉంది. రూ.లక్షల్లో రేషన్ బియ్యం వ్యాపారాన్ని సాగిస్తున్నారు. పొదలకూరు మీదుగా వెంకటగిరి, కలువాయి మండలాల నుంచి కూడా నెల్లూరు మిల్లులకు అక్రమంగా రాత్రి వేళల్లో తోలుతున్నారు. గతంలో పొదలకూరు పోలీసులకు అక్రమం రేషన్ బియ్యం తోలుతున్న పట్టుబడిన సందర్భాలు ఉన్నాయి.
నెల్లూరు(పొగతోట): పచ్చ నేతల అండదండలతో రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. పేద ప్రజల బియ్యం భారీ స్థాయిలో అక్రమ రవాణా జరుగుతోంది. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం అండగా నిలుస్తోంది. గతంలో చాటుమాటుగా సాగే ఈ వ్యాపారం ప్రస్తుతం బహిరంగంగానే జరుగుతోంది. ఈ రేషన్ మాఫియా నేరుగా ఎంఎల్‌ఎస్ పాయింట్ల గోడౌన్ల నుంచే బియ్యాన్ని నేరుగా మిల్లులకు తరలించే స్థాయికి ఏ స్థాయికి బరితెగించింది. ముఖ్యంగా జిల్లాలో ఎమ్మెల్యేలు, మంత్రుల కనుసన్నల్లోనే ఈ వ్యాపారం జరుగుతోంది. ప్రధానంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ సమీప బంధువు సివిల్ సప్లయీస్ శాఖ డైరెక్టర్‌గా ఉండడంతోపాటు ఈ మాఫియాకు కీలక నేతగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అక్రమ రవాణాతో రూ.కోట్లల్లో దందా
ఈ మాఫియా అధికార యంత్రాంగాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని రేషన్ బియ్యాన్ని పాలిష్ పట్టి ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు తరలించి రూ.కోట్లు గడిస్తోంది. గతంలో బియ్యం అక్రమ రవాణాకు మాఫియా డాన్‌గా వ్యవహరించిన కీలక వ్యక్తికి షిప్ (ఓడ)లో 20 శాతం వాటా ఉంది. అధికార పార్టీకి చెందిన ఒక సామాన్యమైన వ్యక్తి ఓడలో పార్టనర్ స్థాయికి ఎదిగాడంటే, దీన్ని బట్టి బియ్యం అక్రమ రవాణా ఏస్థాయిలో జరుగుతుందో ఇట్టే అర్థమవుతోంది. జిల్లా నలుమూలల నుంచి, ప్రకాశం, కడప, తిరుపతి జిల్లాల నుంచి అక్రమంగా తరలించిన రేషన్ బియ్యాన్ని నెల్లూరు నగరంలోని రైస్ మిల్లుల్లో పాలిష్ పడుతున్నారు. నగరంలో ఉన్న 100కు పైగా రైస్ మిల్లుల్లో సుమారు 15 పెద్ద రైస్ మిల్లులు పేదల బియ్యం పాలిష్ మాత్రమే పట్టుతాయి. ఆయా రైస్ మిల్లుల్లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయరు.. మిల్లింగ్ చేయరు.
ప్రతి నెలా మామూళ్లు
జిల్లా వ్యాప్తంగా 1,513 చౌకదుకాణాలు ఉన్నాయి. 7.21 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. చౌకదుకాణాల ద్వారా ప్రతి నెలా 12,500 మెట్రిక్ టన్నుల బియ్యం కార్డుదారులకు పంపిణీ చేస్తున్నారు. బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి ప్రజాప్రతినిధులు, అధికారులు అందరికీ ప్రతి నెలా మామూళ్లు అందుతున్నాయి. ప్రతి డీలర్ నెల్లూరు ఎన్‌టీఆర్‌నగర్‌కు చెందిన ఈ మాఫియా డానుకు మాత్రమే బియ్యం ఇవ్వాలని తీర్మానం చేశారు. ఆయా నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులకు ప్రతి నెలా రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలు ముడుపులు అందుతున్నాయి. అధికారులకు, పోలీసులకు, విజిలెన్స్ అధికారులకు మామూళ్లు అందుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
బియ్యం సేకరణ
ప్రతి నెలా కార్డుల సంఖ్య అధారంగా ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి చౌకదుకాణాలకు రేషన్ సరఫరా చేస్తారు. చౌకదుకాణాల డీలర్లు ప్రతి నెలా 25 నుంచి 30వ తేదీ వరకు దివ్యాంగులు, 65 ఏళ్ల వయస్సు దాటిన కార్డుదారులకు ఇంటింటికి వెళ్లి బియ్యం పంపిణీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇటువంటి లబ్ధిదారులు 92 వేల మంది ఉన్నారు. డీలర్లు దివ్యాంగులు, వృద్ధుల పేరు చెప్పి చుట్టుపక్కల ఉండే కార్డుదారులకు బియ్యం పంపిణీ చేసినట్లు వేలిముద్రలు వేయించుకుని నగదు ఇస్తున్నారు. కార్డుదారుల నుంచి కేజీ బియ్యం రూ.12 నుచి రూ.13లకు డీలర్లు కొనుగోలు చేస్తున్నారు. డీలర్లు సేకరించిన బియ్యాన్ని మాఫియా డాన్‌కు కేజీ రూ.17 నుంచి రూ.20లకు విక్రయిస్తున్నారు. సేకరించిన బియ్యాన్ని పాలిష్ పట్టి బహిరంగ మార్కెట్‌లో కేజీ రూ.50 నుంచి రూ.60లకు విక్రయిస్తున్నారు.
జాయింట్ కలెక్టర్ విధులు సీఎస్‌డీటీలు
వాహనాలు, లారీలను తనిఖిలు చేసే అధికారం సీఎస్‌డీటీలకు ఉన్నాయి. అనుమానం వచ్చిన వాహనాలను పట్టుకున్న సమయంలో బయట వ్యక్తులు ఆరుగురి ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించాలి. వారి సమక్షంలో శాంపిల్స్ సేకరించాలి. అవి పీడీఎస్, నాన్ పీడీఎస్ అని నిర్ధారణ కోసం డీఎం కార్యాలయానికి పంపించాల్సి ఉంది. అప్పటి వరకు వాహనాన్ని పోలీసు స్టేషన్‌కు తరలించాల్సి ఉంది. పీడీఎస్ అయితే కేసు నమోదు చేసి పట్టుకున్న బియ్యాన్ని ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు తరలించాలి. నాన్ పీడీఎస్ బియ్యం అయితే వాహనానికి జాయింట్ కలెక్టర్ రిలీజింగ్ ఆర్డర్ ఇవ్వాల్సి ఉంది. దీనికి సంబంధించి ఫైల్ నిర్వహించాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో రెండు వాహనాలకు పట్టుకున్న అఽధికారులు జాయింట్ కలెక్టర్ అనుమతి లేకుండా సీఎస్‌డీటీలే రిలీజింగ్ ఆర్డర్ ఇచ్చేశారు. జాయింట్ కలెక్టర్ విధులను సైతం సీఎస్‌డీటీలు లాగేసుకోవడం వెనుక అధికార పార్టీ నేతలు, రేషన్ మాఫియా అండదండలు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అనంతసాగరం నుంచి తరలిస్తుండగా పట్టుకొన్న రేషన్ బియ్యం మినీ లారీ (ఫైల్)
కోవూరు: నియోజకవర్గంలో కోవూరు, కొడవలూరు, ఇందుకూరుపేట, విడవలూరు, బుచ్చిరెడ్డిపాళెంల్లో మొత్తం 208 రేషన్ షాపులు, 98,600 కార్డులు ఉన్నాయి. సివిల్ సప్లయీస్ శాఖ డైరెక్టర్ కోవూరు నియోజకవర్గ నేత కావడంతో చంద్రశేఖరపురంలోని ఓ రైస్ మిల్లును అడ్డాగా చేసుకుని ఇక్కడ రేషన్ దందా సాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నెలకు సగటున 980 టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోతున్నాయి. గత ప్రభుత్వంలో ఇంటివద్దకే రేషన్ బియ్యం సరఫరా జరిగేది. దీంతో ఎక్కడా బియ్యం పక్కదారి పట్టేందుకు అవకాశం లేకుండాపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చాక రేషన్ షాపులనే కబ్జా చేసిన మాఫియా నేరుగా ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి, రేషన్ షాపుల నుంచి బహిరంగంగా తరలిస్తున్నారు. చాలా మంది షాపుల వద్దకు వెళ్లి బియ్యం తెచ్చుకోకపోవడంతో ఇది అక్రమార్కులకు అనుకూలంగా మారింది. కొంతమంది డీలర్లు మీరు రేషన్ బియ్యం తినరు కదా మీకెందుకు బియ్యం వాటి బదులు కేజీకి రూ.10 డబ్బులిస్తామంటూ బేరం మాట్లాడుకొంటున్నారు. గతంలో బుచ్చిరెడ్డిపాళెంలోని కొట్టాల దగ్గర ఉన్న రైస్‌మిల్లు ఉంది. కొడవలూరు మండలంలోని చంద్రశేఖరపురం వద్ద ఓ రైస్ మిల్లు, కోవూరు మండలంలోని జమ్మిపాళెం రోడ్డులో ఉన్న రైసుమిల్లులకు తరలించి పాలిష్‌పట్టించి, బ్రాండెడ్ బ్యాగుల్లో ప్యాక్ చేసి పోర్టుల ద్వారా విదేశాలకు, తమిళనాడుకు తరలిపోతున్నాయి.
రేషన్ గోడౌన్ల నుంచే దోపిడీ దందా
చంద్రశేఖరపురం మిల్లులో పాలిష్
కఠిన చర్యలు తీసుకుంటాం
బియ్యం అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. బియ్యం అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక దృష్టి సారిస్తాం. బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. టోల్‌ప్లాజాల వద్ద రాత్రి సమయాల్లో తనిఖిలు నిర్వహిస్తున్నాం. ఫిర్యాదులు అందితే వెంటనే స్పందించి తనిఖిలు నిర్వహించి వాహనాలను సీజ్ చేస్తున్నాం.
– విజయకుమార్, డీఎస్‌ఓ
రెండు రోజుల కిందట అనంతసాగరం మండలం నుంచి కోవూరు సమీపంలోని రైస్ మిల్లుకు తరలిస్తున్న 190 బస్తాల (9.5 టన్నులు) రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. చౌకదుకాణాల ద్వారా రేషన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభమై మొదటి వారంలోనే ఒక రేషన్ షాపు నుంచి ఈ స్థాయిలో బియ్యం అక్రమ రవాణా చేశారంటే పరిస్థితి అర్థమవుతోంది. బియ్యం మాఫియా డాన్‌కు గుడిపల్లిపాడులో సొంత రైస్ మిల్లుతోపాటు మరో మూడు రైస్ మిల్లులను లీజుకు తీసుకుని బియ్యం పాలిష్ పట్టేందుకు మాత్రమే నిర్వహిస్తున్నాడు. ఉదయగిరి, కావలి, కందుకూరు, ఆత్మకూరు, కలువాయి, రాపూరు, వింజమూరు, పొదలకూరు తదితర ప్రాంతాల నుంచి బియ్యం సేకరిస్తున్నారు. ఆ బియ్యాన్ని గోదాము లు, నిమ్మ, మామిడి, బత్తాయి తోట్ల నిల్వ ఉంచు తున్నారు. రాత్రి సమయాల్లో సమయం చూసుకుని నెల్లూరులోని రైస్ మిల్లులకు తరలిస్తున్నారు.

నెలకు 913 టన్నుల బియ్యం పక్కదారి

నెలకు 913 టన్నుల బియ్యం పక్కదారి

నెలకు 913 టన్నుల బియ్యం పక్కదారి