ఫ్యామిలీ డాక్టర్ సేవలకు బ్రేక్
నెల్లూరు (అర్బన్): నడవలేని వృద్ధులను, అనారోగ్యానికి గురై మంచానికే పరిమితమైన, ఇతర ఇబ్బందులు పడుతున్న గర్భిణులకు, అంగన్‌వాడీ, స్కూలు పిల్లలకు ఇంటి వద్దనే నాణ్యమైన వైద్యం అందించేందుకు ఆరోగ్య వ్యవస్థనే ప్రక్షాళన చేశారు. ఇందు కోసం 2022 నవంబర్‌లో ట్రయిల్ రన్‌గా ఫ్యామిలీ కాన్సెప్ట్ విధానాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తెచ్చింది. ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లతో కలిపి 14 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. ప్రతి 5 వేల మంది జనాభాకు ఒక స్పెషలిస్టు డాక్టర్ అనే నినాదంతో ఆ నాటి ప్రభుత్వం ముందుకు సాగింది. 2023 జనవరి నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభించింది. వారిని ఇళ్ల వద్దనే పరీక్షించేవారు. బీపీ, షుగర్, ఈసీజీ వంటి కొన్ని పరీక్షలను ఇంటి వద్దనే చేసేవారు. మందులు పంపిణీ చేశారు. ఆ 2023లో పీహెచ్‌సీ డాక్టర్ ఒక్కో రోజు ఒక్కో గ్రామానికి వెళ్లి ఓపీ సేవలందించారు. 2023లో 8.90 లక్షల మందికి ఓపీ సేవలందించారు. వీరిలో 89 వేల మంది వరకు మంచం మీద ఉన్న రోగులు, వృద్ధులున్నారు. ఇందులో 23 వేల మంది వరకు గర్భిణులు, బాలింతలున్నారు. కూటమి అధికారంలోకి రాక ముందు వరకు 2024లో 8.57 లక్షల మందికి ఇంటి వద్దనే ఓపీ సేవలందించారు. 75 వేల మంది వృద్ధులను, మంచానికి పరిమితమైన వారికి సేవలు అందించారు. కూటమి అధికారంలోకి వచ్చాక 2025లో దాదాపు ఐదు నెలలుగా ఇంటివద్దకు వెళ్లి సేవలు అందించే డాక్టర్లు కనుమరుగయ్యారు.


