నెల్లూరు డివిజన్‌ పరిధిలో ఇలా.. | - | Sakshi
Sakshi News home page

నెల్లూరు డివిజన్‌ పరిధిలో ఇలా..

Dec 26 2025 8:36 AM | Updated on Dec 26 2025 8:36 AM

నెల్లూరు డివిజన్‌ పరిధిలో ఇలా..

నెల్లూరు డివిజన్‌ పరిధిలో ఇలా..

నెల్లూరు (టౌన్‌): వ్యాపారుల స్వార్థం.. అధికారుల అలసత్వం.. వెరసి జీఎస్టీ వసూళ్లు పతనమవుతున్నాయి. ఫలితంగా ప్రభుత్వానికి ఆదాయం తగ్గుముఖం పడుతోంది. వాస్తవానికి నెల్లూరు డివిజన్‌ పరిధిలో నెల్లూరు, ప్రకాశం జిల్లాలున్నాయి. జిల్లాలో నెల్లూరు – 1, 2, 3, కావలి, కందుకూరు.. ప్రకాశం జిల్లాలో ఒంగోలు – 1, 2, మార్కాపురంలో జీఎస్టీ కార్యాలయాలు ఉన్నాయి. నెల్లూరు డివిజన్‌ పరిధిలో 29,852 మంది రెగ్యులర్‌ పన్ను చెల్లింపుదారులు.. 5589 మంది కాంపోజిషన్‌ ట్యాక్స్‌ పేయర్స్‌ ఉన్నారు.

అంతా గోప్యం

ఏడాదికి రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల్లోపు వ్యాపారం చేసే డీలర్లు మూడు నెలలకోసారి.. రూ.50 లక్షలకు పైగా టర్నోవర్‌ గల వారు ప్రతి నెలా రిటర్న్స్‌ను చూపాల్సి ఉంటుంది. ఈ జిల్లాల్లో గ్రానైట్‌, ఆటోమొబైల్స్‌, వెజిటబుల్‌ ఆయిల్స్‌, ఎర్త్‌ మూవింగ్‌ ఎక్విప్‌మెంట్స్‌, ఎలక్ట్రానిక్స్‌ తదితర వ్యాపారాలున్నాయి. వీటి నుంచి జీఎస్టీ రావాల్సి ఉంది. అయితే గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 30 శాతం రాబడి తగ్గిందనే ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంలో జిల్లా అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్‌ అయ్యారని తెలిసింది. అయితే నెల్లూరు డివిజన్‌ పరిధిలో జీఎస్టీ వివరాలను వాణిజ్య పన్నుల శాఖ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ఈ అంశాలను వెల్లడించొద్దంటూ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయని సెలవిస్తున్నారు.

విక్రయాలు కొండంత..పన్ను చెల్లింపు గోరంత

జిల్లాలోని అధిక వ్యాపారులు నిత్యం రూ.లక్షల్లో వ్యాపారాలు చేస్తున్నా, జీఎస్టీని మాత్రం తక్కువ మొత్తంలో చెల్లిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఐదు శాతం.. 18 శాతమనే రెండు స్లాబులను అమలు చేస్తున్నారు. దుకాణంలో రూ.300కుపైగా కొనుగోళ్లను జరిపితే జీఎస్టీ నంబర్‌తో ఉన్న ఒరిజినల్‌ బిల్లును వినియోగదారులకు ఇవ్వాలనే నిబంధన ఉంది. అయితే ఇదెక్కడా అమలు కావడంలేదు. ఒకవేళ ఎవరైనా అడిగితే ధర పెరుగుతుందని చెప్తున్నారు. ఉదాహరణకు హోటళ్లలో వినియోగదారులపై ఐదు శాతం జీఎస్టీని విధిస్తున్నారు. అయితే ఎక్కడా బిల్లులను మాత్రం ఇవ్వడంలేదు. కొందరు వ్యాపారులు కొటేషన్‌ రూపంలో.. మరికొందరు డూప్లికేట్‌ బిల్లు బుక్కును ముద్రించి అందిస్తున్న పరిస్థితి నెలకొంది. జిల్లాలో రెడీమేడ్‌ వస్త్రాలు, ఆటోమొబైల్స్‌, ఎలాక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌, లాడ్జిలు, హార్డ్‌వేర్‌, బంగారు తదితర దుకాణాల్లో వ్యాపారం నిత్యం భారీగా జరుగుతోంది. అయితే ఇక్కడ కొద్ది మొత్తంలోనే బిజినెస్‌ను చూపి జీఎస్టీని భారీగా ఎగ్గొట్టి ప్రభుత్వాదాయానికి గండికొడుతున్నారు.

రెగ్యులర్‌ ట్యాక్స్‌ పేయర్స్‌

29,852

కాంపోజిషన్‌ పన్నుదారులు

5589 మంది

మామూళ్ల మత్తులో అధికారులు

జిల్లాలో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. డివిజన్లోని ఆయా సర్కిళ్ల పరిధిలో గల వ్యాపారులతో నెలవారీ మామూళ్లను కుదుర్చుకున్నారనే ఆరోపణలూ లేకపోలేదు. వినియోగదారులు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాల్లేవు. బెంగళూరు, హైదరాబాద్‌, చైన్నె తదితర ప్రాంతాల నుంచి బిల్లుల్లేకుండా వస్తువులను నిత్యం తీసుకొస్తున్నా, తనిఖీ చేసే నాథుడే కరువయ్యారు. దుకాణాన్ని బట్టి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ప్రతి నెలా వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. ఫలితంగా అంతా ఇష్టారాజ్యంగా మారింది. కాగా ఈ విషయమై జీఎస్టీ సంయుక్త కమిషనర్‌ కిరణ్‌కుమార్‌ను సంప్రదించేందుకు యత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement