పులి సంచారంతో కలకలం
● దుర్గంపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో సంచారం
ఉదయగిరి: ఉదయగిరి దుర్గం రిజర్వ్ ఫారెస్ట్‌లో పులి సంచారంపై కలకలం కొనసాగుతోంది. తాజాగా దుర్గంపల్లి అటవీ ప్రాంతంలో పులి పాదముద్రలను గురువారం గమనించిన స్థానికులు, విషయాన్ని ఆ శాఖ అధికారులకు తెలియజేశారు. దీంతో అక్కడికి వారెళ్లి పరిశీలించి.. పాదముద్రలను సేకరించారు. మంగళవారం రాత్రి సంచరించిన పులి అడుగులు.. ప్రస్తుతానివి పోలి ఉన్నాయనే అంశాన్ని గుర్తించారు. నిర్ధారణ నిమిత్తం వీటిని ల్యాబ్‌కు పంపారు. కాగా తాజాగా కనుగొన్న పాదముద్రలు ఉదయగిరి పట్ణణ శివారులో ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కదలికలను అధికారులు నిఽశితంగా గమనిస్తున్నారు.
ప్రజలను అప్రమత్తం చేస్తున్న
అధికారులు
జనావాస ప్రాంతాలు, రహదారి మార్గంలో పులి కదలికలు ఉండటంతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పెంచలకోన రిజర్వ్ ఫారెస్ట్‌లో పెద్దపులుల సంచారం ఉందని తెలుస్తోంది. మర్రిపాడు – బద్వేల్ జాతీయ రహదారిలో వెంకటాపురం వద్ద కారును పెద్ద పులి ఢీకొందనే ప్రచారం గతేడాది జరిగింది. ఏదిఏమైనా నిర్ధారించడంలో అధికారులు జాప్యం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


