ప్రభుత్వ పతనం ప్రారంభం
నెల్లూరు(వీఆర్సీసెంటర్): రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ పతనం ప్రారంభమైందని మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం, సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మోహన్‌రావు పేర్కొన్నారు. అనకాపల్లికి చెందిన పార్టీ నేత, ప్రజా ఉద్యమనేత అప్పలరాజుపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి, పీడీ యాక్ట్‌ను నమోదు చేయడాన్ని నిరసిస్తూ నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ నుంచి వీఆర్సీ సెంటర్ వరకు భారీ ర్యాలీని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రజా సమస్యలపై ఉద్యమించే వారిపై పీడీ యాక్ట్‌ను నమోదు చేయడంలో ఉన్న శ్రద్ధ.. గంజాయి బ్యాచ్, మహిళలను అక్రమ రవాణా చేస్తున్న వారు, కిరాయి హంతకులను పట్టుకోవడంలో ఎందుకు లేదని ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతుకలను నొక్కేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ధ్వజమెత్తారు. ఉద్యమాలు చేసే వారిపై పీడీ యాక్ట్‌ను ప్రయోగించడాన్ని రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చూస్తున్నామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో సర్కార్ ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. నగరంలో గంజాయిపై వ్యతిరేకంగా పోరాడిన పెంచలయ్య హత్య ఘటనపై సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత ఇప్పటికీ నోరుమెదపకపోవడం, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితికి అద్దం పడుతోందని చెప్పారు. పార్టీ నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మూలి వెంగయ్య, పుల్లయ్య, నేతలు కొండా ప్రసాద్, నాగేశ్వరరావు, వెంకమరాజు, శ్రీరాములు, శేషయ్య, అజీజ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
గంజాయి బ్యాచ్ ఆగడాలు, మహిళల
అక్రమ రవాణాను అరికట్టలేని సర్కార్
ప్రజాసమస్యలపై పోరాడేవారిపై
పీడీ యాక్టా..?
ధ్వజమెత్తిన సీపీఎం నేతలు


