ఇరిగేషన్ అవినీతిపై విచారణకు సిద్ధమా..?
● సోమిరెడ్డి జీవితమంతా
అవినీతిమయం
● మండిపడిన మాజీ మంత్రి
కాకాణి గోవర్ధన్‌రెడ్డి
మనుబోలు: సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగిన అవినీతిపై విచారణకు సిద్ధమానని ఎమ్మెల్యే సోమిరెడ్డికి మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి సవాల్ విసిరారు. మనుబోలులో గురువారం పర్యటించిన ఆయన.. పలు సమస్యలపై ప్రజలతో చర్చించారు. పార్టీ నేత కమలాకర్‌రెడ్డి సతీమణి రాధమ్మ పెద్దకర్మకు హాజరై కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్వేపల్లిలో వివిధ కాలువలకు ఏర్పాటు చేసిన షట్టర్ల విషయంలో తాను అవినీతికి పాల్పడ్డానని ఆరోపిస్తున్న సోమిరెడ్డి సీబీఐ విచారణకు సిద్ధమానని ప్రశ్నించారు. పనులు చేసిన కాంట్రాక్టర్లను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజేందుకు సోమిరెడ్డి ఆడుతున్న డ్రామాగా అభివర్ణించారు. గతంలో నీరు – చెట్టు పేరు చెప్పి పనులు చేయకుండానే బిల్లులు చేసుకున్న పంథాను ఇప్పటికీ ఆయన కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. మోంథా తుఫాన్‌తో దెబ్బతిన్న కాలువలు, చెరువుల మరమ్మతులకు గానూ జిల్లాలోని నియోజవర్గాలకు రూ.97 కోట్లు, సర్వేపల్లికి రూ.17 కోట్లను కలెక్టర్ మంజూరు చేశారని తెలిపారు. గతంలో వివిధ పద్దుల కింద మంజూరైన పనులనే తాజాగా మోంథా తుఫాన్ పేరిట మరోసారి ఇచ్చారంటూ ఆధారాలు చూపారు. సర్వేపల్లిలో తాను చెప్తున్న 316 పనులను ఎక్కడ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు సైతం వివిధ పద్దుల్లో బిల్లులు చేసుకుంటున్నారని ఆరోపించారు.
రూ.కోట్ల దోపిడీకి స్కెచ్
పులికల్లు వద్ద 100 క్యూసెక్కుల డిస్చార్జ్ కెపాసిటీ లేని కాలువను చూపి రూ.కోట్లు దోచుకునేందుకు స్కెచ్ వేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు సాగునీరు, యూరియాను సమృద్ధిగా అందించడంతో పాటు గిట్టుబాటు ధరను కల్పించి.. నష్టపోయిన వారికి ఇన్‌పుట్ సబ్సిడీని ఇచ్చి ఆదుకున్నామని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం రైతులను అడ్డుపెట్టుకొని అవినీతికి సోమిరెడ్డి పాల్పడుతున్నారని మండిపడ్డారు. పంపిణీ చేస్తున్న విత్తనాలు సక్రమంగా మొలకెత్తకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. సోమిరెడ్డికి నీతి, నిజాయతీ ఉంటే అన్నదాతల సమక్షంలో చర్చకు సిద్ధపడాలని సూచించారు. ఆయన అవినీతి బాగోతాన్ని ఆర్టీఐ ద్వారా త్వరలోనే బహిర్గతం చేస్తామని స్పష్టం చేశారు. నేతలు బొమ్మిరెడ్డి హరగోపాల్‌రెడ్డి, ముంగర రవీంద్రరెడ్డి, కడివేటి చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపీపీ గుండాల వజ్రమ్మ, దాసరి భాస్కర్‌గౌడ్, సూరపనేని కిశోర్‌నాయుడు, భాస్కర్‌రెడ్డి, కోటేశ్వరగౌడ్, గిరి, నవకోటి తదితరులు పాల్గొన్నారు.


