విస్తృతంగా యోగాంధ్ర కార్యక్రమాలు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): యోగాంధ్ర కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహించేందుకు కృషి చేయాలని ఉన్నతాధికారులు పిలుపునిచ్చారు. నెల్లూరులోని ఇరుకళలమ్మ దేవాలయం వద్ద బుధవారం సామూహిక యోగా సాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ, కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్, జేసీ కార్తీక్, వివిధ శాఖల అధికారులు, వెయ్యి మందికి పైగా ప్రజలతో కలిసి సామూహికంగా యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా అరుణమ్మ మాట్లాడుతూ భారతదేశం అందించిన యోగా విద్య నేడు ప్రపంచానికి మార్గదర్శకమైందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ యోగా ప్రాధాన్యత తెలిపి వారి దినచర్యలో భాగం చేయడం యోగాంధ్ర ప్రధాన లక్ష్యమన్నారు. యోగా సాధన చేస్తే ఉద్యోగాల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తారన్నారు. జూన్ 21న జిల్లాలో సుమారు 10 లక్షల మంది యోగాసనాలు ఆచరించేలా కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే 300 మంది మాస్టర్ ట్రెయినర్లకు శిక్షణ పూర్తి చేశామన్నారు. గ్రామ, వార్డు స్థాయిలో సుమారు 7 వేల మంది శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. వీరందరూ గ్రామ, వార్డుస్థాయిలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. అనంతరం యోగా గురువులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో టూరిజం రీజినల్ డైరెక్టర్ రమణప్రసాద్, ఆయూష్ ఆర్జేడీ డాక్టర్ పద్మజాతి, మున్సిపల్ కమిషనర్ నందన్, జిల్లా టూరిజం అధికారి ఉషశ్రీ, జిల్లా యోగాసమితి అధ్యక్షుడు విజయకుమార్, కార్యదర్శి పెంచలయ్య, యోగా శిక్షకులు కావ్యశ్రీ, రవీంద్ర, వెంకటసుబ్బయ్య, శ్రీను, దివ్యసాధన్ తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరులో సామూహికంగా యోగా సాధన
పాల్గొన్న జెడ్పీ చైర్‌పర్సన్, కలెక్టర్, ఎస్పీ


