
ఏజెన్సీ మోసాలు మరిన్ని వెలుగులోకి
పారిశుద్ధ్య పనులు చేయించుకుని జీతాలివ్వని కాంట్రాక్టర్
నెల్లూరు నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (పెద్దాస్పత్రి), ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పారిశుద్ధ్య విభాగం.. అవినీతి మురికి మయంగా మారింది. పారిశుద్ధ్య నిర్వహణ కాంట్రాక్ట్ పొందిన అవుట్ సోర్సింగ్ ఎజైల్ ఏజెన్సీ ‘మోనార్క్’లా వ్యవహరిస్తోంది. పెద్దాస్పత్రి సూపర్ బాస్ అండతో పాకీ ఏజెన్సీ దోపిడీ అంతా ఇంతా కాదు. వారాంతపు సెలవులు ఇవ్వకుండా పని చేయించుకోవడం, రాకపోతే జీతాలు కోత విధించడం, పీఎఫ్ చెల్లించకుండా ఆ డబ్బులు జేబులో వేసుకుంటూ కార్మికుల కడుపులు కొడుతున్నారు.
ఈయన పేరు ఎస్‌కే షబ్బీర్. 2014 నుంచి పెద్దాస్పత్రిలో కాంట్రాక్ట్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. ఏజెన్సీ మేనేజర్‌కు అనుకూలంగా ఉన్న ఒకరిద్దరు ఆయన్ను తొలగించాలనే ఉద్దేశంతో సంబంధం లేని ఒక కేసులో ఇరికించారు. అయితే ఆ కేసులో ఆ సూపర్‌వైజర్‌కు క్లీన్‌చిట్ రావడంతో మళ్లీ డ్యూటీలో జాయిన్ అయ్యాడు. 2024 జూన్, జూలై నెలల్లో విధులు నిర్వర్తించినప్పటికీ ప్రభుత్వ సూపర్‌వైజర్ల రిజిస్టర్‌లో సంతకాలు చేసి ఉన్నప్పటికీ ఆయా నెలల జీతాలు ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నారు.
ఈ పారిశుద్ధ్య కార్మికురాలి పేరు లలితమ్మ. ఈమె 8 ఏళ్లుగా పెద్దాస్పత్రిలో పని చేస్తోంది. అనారోగ్యంతో గతేడాది కొన్ని నెలలు విధులకు రాలేదు. తిరిగి ఈ ఏడాది మార్చి 7న విధుల్లో చేరింది. అయితే ఆ కార్మికురాలికి మార్చి, ఏప్రిల్ జీతాలు ఇవ్వలేదు. ఆస్పత్రిలో ప్రభుత్వం తరఫున పనిచేసే సూపర్‌వైజర్ వేసిన హాజరు రిజిస్టర్‌లో ఆమె సంతకాలు కూడా ఉన్నాయి. అయితే ఏజెన్సీ మేనేజర్ మాత్రం విధులకు హాజరు కాలేదంటూ జీతాలు ఎగ్గొట్టాడని ఆమె వాపోతోంది.
నెల్లూరు (అర్బన్): జీజీహెచ్, ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ కాంట్రాక్ట్ పొందిన అవుట్ సోర్సింగ్ ఎజైల్ ఏజెన్సీ అవినీతి, అక్రమాల్లో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. శుక్రవారం సాక్షిలో ‘కార్మికుల పొట్ట గొడుతున్నారు’ శీర్షికన కథనం ప్రచురితం కావడంతో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి తమకు జరిగిన అన్యాయాలను చెప్పుకుంటున్నారు. చాకిరి చేయించుకుని జీతాలు ఎగ్గొట్టిన వైనం నుంచి ఫేక్ విద్యా సర్టిఫికెట్లు సృష్టించిన వరకు అవినీతి, అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పెద్దాస్పత్రి అడ్మినిస్ట్రేషన్ అధికారి అయిన డిప్యూటీ కలెక్టర్ మహేశ్వరరెడ్డికి ఫిర్యాదు వెల్లువెత్తుతున్నాయి. పారిశుద్ధ్యం, సెక్యూరిటీ నిర్వహణకు ప్రభుత్వం ఏడాదికి సుమారు రూ.10 కోట్ల వరకు నిధులు కేటాయిస్తోంది. ఈ మేరకు తగినంత పారిశుధ్య కార్మికులు, సెక్యూరిటీ సిబ్బందిని నియమించాల్సి ఉండగా సదరు పెద్దాస్పత్రి సూపర్ బాస్ అరకొరగా సిబ్బందిని నియమించి నిధులు కాజేస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. ఇక ఆస్పత్రిలో విధుల్లో సెక్యూరిటీ స్థానంలో పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తుండడం విశేషం. గత నాలుగేళ్లలో పారిశుధ్య విభాగంలో జరిగిన కోట్లాది రూపాయిల కుంభకోణం వెలుగు చూడాలంటే ప్రభుత్వం తక్షణమే విజిలెన్స్ విచారణ జరిపించాలని ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు కోరుతున్నారు.
వేతనాల్లో కోతలు
కార్మిక చట్ట ప్రకారం విధుల్లో వారికి వారాంత సెలవులు, పండగ సెలవులు తప్పనిసరిగా కేటాయించాలి. కానీ ఆ రోజుల్లో కూడా వారితో పనులు చేయించుకుంటున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఒక వేళ ఆరోగ్యం బాగోలేకపోయినా, అత్యవసరమై సెలవు పెట్టినా ఆ రోజు జీతం కోత విధిస్తున్నారు. దీనికంటే ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే.. కార్మికులకు మధ్య, మధ్యలో కొన్ని నెలలు జీతాలు ఎగ్గొట్టేస్తున్నారు. ఇదంతా పెద్దాస్పత్రి సూపర్ బాస్‌తో కలిసి సదరు పారిశుద్ధ్య ఏజెన్సీ నిర్వాహకుల నిర్వాకం.
రికార్డులు మాయం
కార్మికులు ఎదురు తిరిగి ప్రశ్నించడంతో కాంట్రాక్ట్‌కు సంబంధించిన హాజరు, ఇతర రికార్డులు హాస్పిటల్లో లేకుండా మాయం చేశారు. రికార్డులను తారు మారు చేస్తున్నారని తెలుస్తోంది. ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నప్పటికీ పెద్దాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధానాయక్ మౌనంగా ఉండడంతో ఏజెన్సీ నిర్వాహకుల అవినీతి, అక్రమాలు మితిమీరాయనే ఆరోపణలు ఉన్నాయి.
ప్రజాప్రతినిధులకు విలువేది
కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి తన నియోజకవర్గం నుంచి ఎస్.సునీతను పెద్దాస్పత్రిలో పారిశుద్ధ్య కార్మికురాలిగా కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చేలా సదరు ఏజెన్సీకి సిఫార్సు చేశారు. వారు ఎమ్మెల్యే సూచన మేరకు విధుల్లోకి తీసుకున్నారు. డిసెంబర్ 2024 నుంచి పనిచేస్తున్నా 5 నెలలుగా ఏదో కారణం చెబుతూ జీతం ఇవ్వలేదు. మరి ఆ కార్మికురాలు ఎలా బతకాలో సంస్థకే తెలియాలి. ఇలా పనిచేస్తూ కొన్ని నెలలుగా జీతాలు పొందలేని వారిలో సూపర్‌వైజర్ సాయి నిఖిల్‌తోపాటు మాజీ మేయర్ భానుశ్రీ చేర్పించిన సుప్రజ, సెక్యూరిటీలో సుధాకర్, భరత్ దాదాపు 14 మంది వరకు ఉన్నారు.
కార్మిక చట్టానికి వ్యతిరేకంగా
వేతనాల్లో కోతలు
పీఎఫ్ చెల్లించకుండా మరో దగా
పుట్టిన తేదీల కోసం వేల రూపాయలు
గుంజి ఫేక్ సర్టిఫికెట్లు
డిప్యూటీ కలెక్టర్, పెద్దాస్పత్రి
అడ్మినిస్ట్రేషన్ అధికారికి ఫిర్యాదులు
సాక్షి కథనంతో ఒక్కొక్కరుగా
ముందుకొస్తున్న బాధితులు
విచారణ జరిపిస్తాం
పీఎఫ్ జమ చేయించేందుకు స్టడీ సర్టిఫికెట్‌లు ఇప్పిస్తామంటూ కొంత మంది కార్మికుల దగ్గర లంచాలు వసూలు చేసినట్లు నాకు ఫిర్యాదులు వచ్చాయి. పీఎఫ్ జమ కాలేదంటూ తెలిపారు. దీనిపై లోతుగా విచారిస్తాం. జీతాలు ఇవ్వని వారి గురించి విచారిస్తాం. తప్పు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.
– మహేశ్వరరెడ్డి, డిప్యూటీ కలెక్టర్,
పెద్దాస్పత్రి అడ్మినిస్ట్రేషన్ అధికారి

ఏజెన్సీ మోసాలు మరిన్ని వెలుగులోకి

ఏజెన్సీ మోసాలు మరిన్ని వెలుగులోకి