
‘పది’ సప్లిమెంటరీ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు
నెల్లూరు రూరల్: జిల్లాలో ఈనెల 19 నుంచి 28వ తేదీ వరకు జరిగే పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లను పక్కాగా చేయాలని కలెక్టర్ ఒ.ఆనంద్ ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో గురువారం పరీక్షలపై సంబంధిత అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా చూడాలన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా తాగునీటి వసతి సౌకర్యం కల్పించాలన్నారు. కేంద్రాల వద్ద తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులు కేంద్రాలకు సకాలంలో చేరుకునేందుకు బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులు సూచించారు. హాల్‌టికెట్ చూపించిన వారికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల జరుగుతాయన్నారు. 38 సెంటర్లలో 5,422 మంది హాజరుకానున్నట్లు చెప్పారు. అలాగే ఈనెల 19 నుంచి 24వ తేదీ వరకు ఏపీ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. టెన్త్‌లో 745 మంది అభ్యర్థుల కోసం 12 సెంటర్లు, ఇంటర్‌లో 949 మంది కోసం 6 సెంటర్లు ఎంపిక చేసినట్లు చెప్పారు. పరీక్షల నిర్వహణకు చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు, తనిఖీ బృందాలను నియమించినట్లు వెల్లడించారు. సమావేశంలో ఆర్‌ఐఓ వరప్రసాద్‌రావు, అధికారులు పాల్గొన్నారు.