
ప్రచారార్భాటాలే తప్ప చేస్తోందేమీలేదు
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): ప్రచారార్భాటాలే తప్ప నగరానికి మంత్రి నారాయణ చేస్తోందేమీలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు, కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున ధ్వజమెత్తారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో శనివారం ఆయన మాట్లాడారు. మంత్రికి పబ్లిసిటీ పిచ్చి పట్టుకుందని, ఇందులో భాగంగానే భగత్‌సింగ్ కాలనీలో 1400 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తున్నామంటూ డప్పు కొట్టుకుంటున్నారని విమర్శించారు. గతంలో వరద ముంపునకు గురైన సమయంలో అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వచ్చి కాలనీవాసుల పరిస్థితిని చూసి శాశ్వత రక్షణ కల్పించేలా రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ.100 కోట్లను మంజూరు చేసిన అంశాన్ని గుర్తుచేశారు. అక్కడి 3500 కుటుంబాలకు పొజిషన్ సర్టిఫికెట్లను మంజూరు చేయాలని ఆదేశించడంతో అదే రోజున జారీ అయ్యాయని వివరించారు. గత ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరొస్తుందనే ఉద్దేశంతో ఆగమేఘాలపై ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని తెరపైకి మంత్రి తెచ్చారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలోనే నగరం అభివృద్ధి చెందిందని, ఈ విషయమై చర్చకు టీడీపీ నేతలు సిద్ధమానని సవాల్ విసిరారు. 13వ డివిజన్లో నిర్మించిన మూడు పార్కులను తాను అభివృద్ధి చేశానంటూ ఆయన గొప్పలు చెప్పుకొంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల అనంతరం ఆ పార్కుల్లో పనిచేస్తున్న సిబ్బందిని మంత్రి నారాయణ తొలగించారని ఆరోపించారు. అదే డివిజన్లోని టీడీపీ నేతలకు రూ.50 లక్షల కాంట్రాక్ట్ పనులను అప్పగించి వారి అనుచరులకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పార్కుల అభివృద్ధి పనుల పేరుతో ఎంత అవినీతి జరుగుతోందో అర్థం చేసుకోవాలని కోరారు. తాము శంకుస్థాపన చేసి పూర్తయిన పనులను టీడీపీ నేతలు ప్రస్తుతం ప్రారంభిస్తున్నారే తప్ప, వారు చేసిందేమీలేదన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని హితవు పలికారు.
మంత్రి నారాయణకు పబ్లిసిటీ పిచ్చి
విమర్శించిన ఊటుకూరు నాగార్జున