స్పందించకపోతే స్తంభింపజేస్తాం
సైదాపురం: తెల్లరాయి దొంగలపై కఠినమైన చర్యలు తీసుకోకపోతే మైనింగ్ కార్యకలాపాలను స్తంభింప చేస్తామని జెడ్పీ మాజీ వైస్ చైర్‌పర్సన్, మాజీ రాష్ట్ర నృత్య అకాడమీ చైర్ పర్సన్ పొట్టేళ్ల శీరిషాయాదవ్ హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం సైదాపురం ఎస్సై క్రాంతికుమార్‌కు రెండో సారి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని చాగణంరాజుపాళెంలోని సిద్ధి వినాయక, సైదాపురం సమీపంలోని శ్రీనివాస పద్మావతి గనుల్లో అక్రమంగా బ్లాస్టింగ్ జరుగుతుందంటూ గతంలో ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆత్మకూరు డీఎస్పీకి కూడా ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశామన్నారు. ముగ్గురు అమాయకులపై దాడులు చేసిన 20 మంది రౌడీమూకలపై కూడా సమగ్ర విచారణ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్న ఖనిజాన్ని అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా దోపిడీ చేస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం సిగ్గు చేటుగా ఉందని ఆమె విమర్శించారు. నిత్యం ప్రమాదభరితంగా బ్లాస్టింగ్‌లు చేస్తున్నా కూడా సంబంధిత అధికారులు ఎందుకు మౌనం వహిస్తురో అర్థం కావడం లేదన్నారు.
తెల్లరాయి దోపిడీపై
చర్యలు తీసుకోండి
బ్లాస్టింగ్‌లను వెంటనే ఆపాలి
జెడ్పీ మాజీ వైస్ చైర్‌పర్సన్ పొట్టేళ్ల శీరిషా


