కార్మికులకు అండగా వైఎస్సార్‌సీపీ
● జిల్లా కార్యాలయంలో ఘనంగా మేడే
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): కార్మికులకు వైఎస్సార్‌సీపీ అన్ని విధాలా అండగా ఉంటుందని ఆ పార్టీ నేతలు తెలిపారు. వైఎస్సార్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు బి.జయకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం మేడేను ఘనంగా నిర్వహించారు. ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలు మేరిగ మురళీధర్, మేకపాటి విక్రమ్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, ఆనం విజయకుమార్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్‌టీయూసీ జెండాను ఆవిష్కరించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కార్మిక వర్గాల ప్రయోజనాల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. ఆటో డ్రైవర్లు, నాయీ బ్రాహ్మణులు, చేనేతలు, మత్స్యకారులు, టైలర్లు తదితరులకు ఆర్థిక సాయం చేశారని తెలిపారు. మహిళల కోసం పలు పథకాలు ప్రవేశపెట్టి ఆర్థిక తోడ్పాటునిచ్చారన్నారు. ఆరోగ్యశ్రీలో అనే వ్యాధులను చేర్చి కార్మికులకు అండగా నిలిచారన్నారు. ఆరోగ్య కేంద్రాల్లో అత్యుత్తమ వైద్యం అందేలా నాడు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. జిల్లాలో కార్మికుల సమస్యలపై ఐక్యంగా పోరాడుతామన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


