స్మార్ట్ స్ట్రీట్ త్వరలో ప్రారంభం
నెల్లూరు(బారకాసు): ప్రతి ఇంటి నుంచి పారిశ్రామికవేత్తలను తయారు చేయాలనే సీఎం ఆశయాలకు అనుగుణంగా నెల్లూరులో స్మార్ట్ స్ట్రీట్‌ను త్వరలో ప్రారంభించనున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ద్వారా స్మార్ట్ స్ట్రీట్ వెండార్లకు నగరపాలక సంస్థ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమ ముగింపు సందర్భంగా శనివారం ఆయన మాట్లాడారు. మొదటి దశలో 163 మంది వీధి వ్యాపారులను ఎంపిక చేసి వారితో స్మార్ట్ బజార్లను నిర్వహించనున్నామని చెప్పారు. దీనికి అవసరమైన సబ్సిడీలు, రుణాలు, సోలార్ పవర్‌ను అందజేయడమే కాకుండా వారికి వ్యాపారంలో మెళకువలు తెలియజేసేందుకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించామని వెల్లడించారు. ప్రస్తుతం ఎంపిక చేసిన 163 మందికి బ్యాచ్‌ల వారీగా కంప్యూటర్‌లో ప్రాథమిక శిక్షణను సైతం అందిస్తామన్నారు. అనంతరం వెండార్లకు సర్టిఫికెట్లు, యూనిఫారాన్ని అందజేశారు. కమిషనర్ నందన్, మెప్మా పీడీ రాధమ్మ, అడిషనల్ మిషన్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, స్టేట్ మిషన్ డైరెక్టర్ శ్రీనివాసులు, సుధీర్‌వర్మ తదితరులు పాల్గొన్నారు.


