
గ్రావెల్.. అన్‌స్టాపబుల్
కూటమి ప్రభుత్వం కొలువుదీరాక పచ్చ నేతల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. నిన్నామొన్నటి వరకు ఇసుకను కొల్లగొట్టి భారీగా వెనుకేసుకున్న వీరి కళ్లు గ్రావెల్‌పై పడ్డాయి. అనుకున్నదే తడవుగా దగదర్తి మండలంలో దీన్ని యథేచ్ఛగా తవ్వుతూ లారీల్లో నిత్యం తరలిస్తున్నారు. విసిగివేసారిన గ్రామస్తులు ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారు. వాహనాలతో తొక్కించి చంపేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఈ వ్యవహారంలో అధికారుల పరోక్ష సహకారం ఉండటంతో వీరు మరింత చెలరేగిపోతూ సవాల్ విసురుతున్నారు.
ప్రమాదాలు
జరుగుతాయనే ఆందోళన
కాలనీ వెనుక వైపు దాదాపు 40 అడుగుల మేర గోతులు తవ్వారు. వర్షాకాలంలో నీరు నిలిచి పిల్లలు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఫిర్యాదులు బుట్టదాఖలవుతుండటంతో ఇక తమకు దిక్కెవరని వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు దగదర్తి ప్రాంతంలోని కేకేగుంట, ఉలవపాళ్ల తదితర గ్రామాల్లోని గ్రావెల్‌కు డిమాండ్ అధికంగా ఉండటంతో కూటమి నేతలు కుమ్మకై ్క తమ పనిని కానిచ్చేస్తున్నారు. జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా అక్రమ రవాణా ఆగలేదంటే ప్రజాప్రతినిధులు ఇందులో భాగస్వాములయ్యారనే అంశం స్పష్టంగా అర్థమవుతోంది.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీ నేతల ధనదాహం పరాకాష్టకు చేరుతోంది. ఇసుక.. మద్యం.. ఇలా ప్రతి అంశంలో తమ మాటే చెల్లుబాటయ్యేలా వ్యవహరిస్తూ వచ్చిన వీరు.. తాజాగా గ్రావెల్‌ను కొల్లగొట్టడంలో నిమగ్నమయ్యారు. వీరి చేష్టలతో దగదర్తి మండలంలోని ఉలవపాళ్ల, కేకేగుంట, సున్నపుబట్టి తదితర ప్రాంతాల్లో గ్రావెల్ అక్రమ రవాణా రెండు నెలలుగా నిరాటంకంగా జరుగుతోంది.
రాత్రయితే హడలే..
ఉలవపాళ్లలో రాత్రి వేళ ఈ వ్యవహారం జోరుగా సాగుతోంది. రెండు పొక్లయిన్లు ఏర్పాటు చేసి రాత్రి ఏడు నుంచి ఉదయం ఏడు వరకు 20 లారీల్లో గ్రావెల్‌ను యథేచ్ఛగా తరలిస్తున్నారు. మండలంలోని చోటా.. నియోజకవర్గ స్థాయి నేతల కనుసన్నల్లో ఈ వ్యవహారం జరుగుతోంది. గ్రామస్తులెవరైనా అడ్డుకుంటే తొక్కి చంపేస్తామంటూ పరుష పదజాలంతో దూషిస్తున్నారు. ఈ క్రమంలో రాత్రి వేళ వాహన శబ్దాలతో బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సి వస్తోంది.
ఫిర్యాదు చేస్తే కన్నెర్రే..!
కాలనీకి వెనుక వైపు ఉన్న ప్రభుత్వ భూముల్లో గ్రావెల్ అక్రమ రవాణా మూడు పువ్వులు.. ఆరు కాయలు అనే చందంగా సాగుతోంది. ఒకవేళ ఎవరైనా ఫిర్యాదు చేస్తే, వారిపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని సమాచారం. ఒకరిద్దరు సాహసం చేసి వీడియోలు, ఫొటోలు తీసి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఆయన.. స్థానిక తహసీల్దార్‌కు ఫోన్ చేసి చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. ఫలితంగా లారీని స్వాధీనం చేసుకున్నారు. అయితే కూటమి నేతల ఒత్తిళ్లతో దీన్ని వదిలేశారు. అదే రోజు రాత్రి నుంచి అక్రమ రవాణా మళ్లీ మొదటికొచ్చింది.
ఉలవపాళ్ల, కేకేగుంట, సున్నపుబట్టీలో యథేచ్ఛగా తవ్వకాలు
కొల్లగొడుతున్న టీడీపీ నేతలు
అడ్డుకున్న గ్రామస్తులపై దౌర్జన్యాలు
లారీలతో తొక్కిస్తామంటూ
హెచ్చరికలు
అధికారుల పరోక్ష సహకారం
దగదర్తి మండలంలో ఇదీ తంతు
రోడ్లు.. పైప్‌లైన్లు ధ్వంసమై
భారీ వాహనాల పుణ్యమానని గ్రామంలోని రోడ్లు.. తాగునీటి పైప్‌లైన్లు దెబ్బతిన్నాయి. ఫలితంగా గ్రామస్తుల పాట్లు వర్ణనాతీతమవుతున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

గ్రావెల్.. అన్‌స్టాపబుల్