రైతులను ఆదుకోకపోతే పోరాటం చేస్తాం
నెల్లూరు(బారకాసు): ‘పంటకు గిట్టుబాటు ధర లేక వరి రైతులు ఆందోళన చెందుతున్నారు. వారిని ఆదుకోకపోతే పోరాటం చేస్తాం’ అని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. గురువారం నెల్లూరు నగరంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ధాన్యాన్ని ప్రభుత్వం సక్రమంగా కొనుగోలు చేయకపోవడంతో రైతులు దళారులకు విక్రయించుకుంటున్నారని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు అమరావతిలో సమీక్షలు, సమావేశాలు నిర్వహించుకుంటున్నారే తప్ప ధాన్యం కొనుగోలుకు సంబంధించి స్పష్టమైన నిర్ణయాలు ప్రకటించడం లేదన్నారు. జిల్లాలో పుట్టి ధాన్యం రూ.19,720లకు అమ్మాల్సి ఉండగా ప్రస్తుతం రూ.15,500 విక్రయించుకునే పరిస్థితి రైతులకు ఏర్పడిందన్నారు. ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ముందుకురాక, మరోవైపు దళారులు తక్కువ రేటుకు కొనుగోలు చేస్తుండటంతో అన్నదాతలు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇదే సీజన్‌లో పుట్టి ధాన్యం రూ.22 వేలకు కల్లాలోనే కొనుగోలు చేయడం జరిగిందని గుర్తు చేశారు. అదేవిధంగా ఆరబెట్టిన ధాన్యాన్ని రూ.25 వేల నుంచి రూ.26 వేల వరకు కొనుగోలు చేశారన్నారు. కూటమి ప్రభుత్వంలో ధాన్యాన్ని కొనుగోలు చేయడం ఆపేశారని దీంతో రైస్‌మిల్లర్లు, దళారులు విజృంభిస్తున్నారని చెప్పారు. దీంతో రైతు ఎకరాకు రూ.40 వేలు నష్టపోయే పరిస్థితి నెలకొందన్నారు. ప్రస్తుతం గన్నీబ్యాగ్‌లు లేవని, రవాణా సౌకర్యం లేదని, కూలీలు లేరని రైతులు వాపోతున్నారన్నారు. ఏప్రిల్ మూడో వారం వరకు ధాన్యం కోతలు ఉంటాయని కాబట్టి, ప్రభుత్వం కళ్లు తెరిచి గిట్టుబాటు ధర కల్పించి అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గిట్టుబాటు ధర ఇచ్చేంత వరకు రైతుల పక్షాన వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు.
బ్లాక్‌మెయిల్ కోసమే..
మిల్లర్లు, దళారులు రైతుల వద్ద ధాన్యాన్ని తక్కువ రేటుకు కొనుగోలు చేయడానికి వీలు లేదంటూ ఎమ్మెల్యే సోమిరెడ్డి వాట్సాప్‌లో పోస్టు చేశారని కాకాణి అన్నారు. దీనికి కారణం రైతుల మీద ప్రేమ కాదని కేవలం రైస్‌మిల్లర్లు, దళారులను బ్లాక్‌మెయిల్ చేసేందుకేనన్నారు. అమరావతిలో కలెక్టర్లు, శాసనసభ్యులతో మాట్లాడటం, ఇక్కడకు వచ్చి రైస్‌మిల్లర్లు, దళారులతో డీల్ కదుర్చుకోవడం చేస్తున్నారన్నారు. గతంలో క్వార్ట్‌జ్ మైనింగ్ దగ్గరికి కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లి హడావుడి చేశారని.. ఆ తర్వాత వాటి యజమానులను బెదిరించి వాటాలు తీసుకున్న ఘనత సోమిరెడ్డిదన్నారు.
వరికి గిట్టుబాటు ధర లేక ఆందోళన
పెట్టుబడి కూడా రాక ఆత్మహత్యలు
చేసుకునే పరిస్థితి
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి


