
నెలరోజులు.. రూ.5 కోట్లు
నెల్లూరు(క్రైమ్): సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. నయామోసాలతో క్షణాల్లో జనాలను దోచేస్తున్నారు. ఇళ్లలో దొంగతనాలు.. దారిదోపిడీల కన్నా ప్రస్తుతం సైబర్ నేరాలే అందరిని హడలెత్తిస్తున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న కొందరు ఇతర ఆదాయాల కోసం ఆన్‌లైన్‌లో అన్వేషిస్తున్నారు. ఇది గమనించిన సైబర్ నేరగాళ్లు వలవేసి రూ.లక్షలు కొట్టేస్తున్నారు. చదువుకున్నవారే ఎక్కువగా మోసపోతున్నారు. నెలరోజుల వ్యవధిలో జిల్లాకు చెందిన డాక్టర్లు, ఆడిటర్లు, విశ్రాంత ఉద్యోగి తదితరుల నుంచి రూ.5 కోట్ల వరకు సైబర్ నేరగాళ్లు దోచేశారు. ఏడాదికేడాది మోసాలు పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
సీబీఐ పేరుతో..
ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు కొత్తపంథాలో నేరాలకు పాల్పడుతన్నారు. డిజిటల్ అరెస్ట్‌లు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. సైబర్ నేరాల్లో ప్రస్తుతం ఈ తరహా మోసాలే అధికంగా జరుగుతున్నాయి. సీబీఐ, ఈడీ, నార్కోటిక్స్ అధికారుల పేరిట సమాజంలో సంపన్నవర్గాలు, విద్యావంతులు, ఉద్యోగులు, వైద్యులు, పిల్లలకు దూరంగా ఉంటున్న తల్లిదండ్రులకు ఫోన్ చేసి నమ్మేలా ప్రవర్తిస్తారు. అనంతరం విదేశాల నుంచి వచ్చిన కొరియర్‌లో డ్రగ్స్, ఇతర మాదకద్రవ్యాలు ఉన్నాయని, మీపేరుపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యిందంటూ నకిలీ పత్రాలను వాట్సాప్‌లో పంపుతున్నారు. విచారణ పూర్తయ్యే వరకూ ఇంట్లో నుంచి కదలనివ్వకుండా నిర్బంధిస్తున్నారు. వివరాలు సేకరిస్తున్నట్లు నటిస్తూ కేసు నుంచి బయటపడాలంటే తాము చెప్పినంత మొత్తాన్ని చెల్లించాలని లేదంటే అరెస్ట్ తప్పదని కంగారుపెట్టి వారు అడిగినంత ఖాతాలో జమయ్యాక వదిలేస్తున్నారు. మనీ ల్యాండరింగ్ చేస్తున్నారంటూ మరికొందర్ని బెదిరించి డబ్బులు కాజేస్తున్నారు. ట్రేడ్ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని, వర్క్ ఫ్రం హోమ్ పేరిట నమ్మించి ఇంకొందరిని మోసగిస్తున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మోసగాళ్లు చెప్పేవి నిజమని భావించొద్దు. అసలు డిజిటల్ అరెస్ట్‌లు లేవు. నిజంగా ఏదైనా కేసు ఉంటే సంబంధిత పోలీస్ అధికారి నేరుగా వచ్చి మాట్లాడతారు. దేశంలో ఏ దర్యాప్తు సంస్థ కూడా వీడియోకాల్లో విచారణ చేయదు. అలా చేస్తే వారు సైబర్ నేరగాళ్లని అర్థం చేసుకోవాలి. మోసపూరిత ఫోన్ కాల్ వస్తే సమీప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. సైబర్ మోసాలకు గురైతే వెంటనే టోల్‌ఫ్రీ నంబర్ 1930 లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సైబర్‌క్రైమ్.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలి. తక్షణ ఫిర్యాదుతో బాధితులు కోల్పోయిన డబ్బులు తిరిగి పొందే అవకాశాలుంటాయని పోలీస్ అధికారులు పేర్కొంటున్నారు.
డిజిటల్ అరెస్ట్ ద్వారా కాజేసిన సైబర్ నేరగాళ్లు
రోజురోజుకూ పెరుగుతున్న బాధితులు
ఇటీవల మోసపోయిన విశ్రాంత ఉద్యోగి
అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
నెల్లూరు చైతన్యపురి కాలనీకి చెందిన విశ్రాంత ఉద్యోగిని సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 5వ తేదీ వరకు అతడి వద్ద నుంచి రూ.1.02 కోట్ల నగదును వివిధ బ్యాంక్ ఖాతాలకు జమ చేయించుకున్నారు. బెయిల్ కావాలంటే రూ.3 కోట్లు ఇవ్వాలని చెప్పడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
జిల్లాకు చెందిన ఇద్దరు డాక్టర్లను సైతం ఇదే తరహాలో మోసగించారు. ఈ విషయంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
పొగతోటకు చెందిన ఓ మహిళకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆన్‌లైన్ ట్రేడింగ్‌పై లింక్ వచ్చింది. ఆమె దానిపై క్లిక్ చేయగా వాట్సాప్ నంబర్‌కు నిషాబాసు అనే మహిళ మెసేజ్ పంపింది. ఆన్‌లైన్ మార్కెటింగ్‌లో లాభాలు వచ్చేందుకు సలహాలు, సూచనలిస్తామని నమ్మబలికి తమ కంపెనీ యాప్‌ను మహిళ ఫో్‌న్‌లో ఇన్‌స్టాల్ చేయించి నగదు డిపాజిట్ చేయించింది. ట్రేడింగ్‌లో ఆదాయం వచ్చేలా చేసి ఆమెను నమ్మించింది. అనంతరం మహిళ చేత రూ.2.46 కోట్లు పెట్టించి మోసగించింది. బాధితురాలు చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
డిజిటల్ అరెస్ట్‌లు ఉండవు
సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పోలీస్ అధికారులు వీడియోకాల్ చేసి కేసుల విచారణ చేయరు. అలా చేశారంటే మోసం చేస్తున్నారని గుర్తించాలి. డిజిటల్ అరెస్ట్‌ల్లేవు. సైబర్ మోసాలపై జిల్లాలో విస్తృ తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఎవరైనా మోసాలకు గురైతే 1930, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయండి.
– జి.కృష్ణకాంత్, ఎస్పీ

నెలరోజులు.. రూ.5 కోట్లు