‘పది’ పరీక్షలకు సర్వం సిద్ధం
జిల్లాలో ఇలా..
రేపటి నుంచి ప్రారంభం
● ఏర్పాట్లు చేసిన జిల్లా
విద్యాశాఖ అధికారులు
● జంబ్లింగ్ పద్ధతిలో నిర్వహణ
● పరీక్ష కేంద్రాల వద్ద
144 సెక్షన్ అమలు
● సమస్యల పరిష్కారం కోసం
కంట్రోలురూమ్ ఏర్పాటు
పరీక్ష కేంద్రాలు : 174
విద్యార్థుల సంఖ్య : 33,434
సమస్మాత్మక కేంద్రాలు : 16
సీసీ కెమెరాల ఏర్పాటు : 7 కేంద్రాల్లో..
ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు : 9
సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు : 24
ఇన్విజిలేటర్లు : 1,968 మంది
నెల్లూరు(టౌన్): పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 31వ తేదీ వరకు ఇవి జరుగుతాయి. దీనికి సంబంధించి జిల్లా విద్యాశాఖాధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా గాలి, వెలుతురు, పూర్తిస్థాయిలో బెంచీలుండేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే హాల్ టికెట్లను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల లాగిన్‌లో అందుబాటు ఉంచారు. దీంతోపాటు ప్రభుత్వ వాట్సాప్ నంబర్ 95523 00009కు విద్యార్థి వివరాలు పంపి హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకునేలా అవకాశం కల్పించారు. ఎగ్జామ్స్‌ను జంబ్లింగ్ పద్ధతిలో నిర్వహించనున్నారు. అలాగే విద్యార్థులు హాల్‌టికెట్ చూపించి ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించవచ్చు.
బాలికలే అధికం
జిల్లా వ్యాప్తంగా 33,434 మంది (బాలురు 16,250 మంది, బాలికలు 17,184 మంది) విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. మొత్తం 174 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 16 కేంద్రాలను సమస్యాత్మక, వాటిల్లో ఏడింటిని అతి సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఇక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. పరీక్ష సమయానికి అరగంట ముందు విద్యార్థులను కేంద్రంలోకి అనుమతించనున్నారు. గంట ముందు చేరుకోవాలని విద్యాశాఖాధికారులు సూచిస్తున్నారు. రెండు సెట్ల ప్రశ్నపత్రాలను జిల్లా వ్యాప్తంగా 48 స్టోరేజ్ పాయింట్లలో భద్రపరిచారు. పోలీస్ బందోబస్తు నడుమ ఏరోజుకారోజు ప్రశ్నపత్రాలను సమీపంలోని పరీక్ష కేంద్రాల్లోకి తీసుకెళ్లనున్నారు.
సిబ్బంది నియామకం ఇలా..
పరీక్షల నిర్వహణకు 1,968 మంది ఇన్విజిలేటర్లను, 174 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 174 మంది డిపార్ట్‌మెంట్ అధికారులను నియమించారు. మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా 9 ఫ్లయింగ్ స్క్వాడ్, 24 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర పరిశీలకుడిగా సమగ్రశిక్ష ఏఎస్‌పీడీ రవీంద్రనాథ్‌రెడ్డిని నియమించారు. ఎగ్జామ్స్ సమయంలో కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. సమీప ప్రాంతాల్లో ఉండే జెరాక్స్ సెంటర్లు, ఆన్‌లైన్ సెంటర్లను మూసివేయించనున్నారు. కేంద్రంలోకి స్మార్ట్ వాచ్‌లు, కాలుక్యులేటర్లు, సెల్‌ఫోన్లను నిషేధించారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ అధికారులు సైతం సెల్‌ఫోన్లను తీసుకెళ్లకూడదు.
అధికారులతో సమావేశం
రాష్ట్ర పరిశీలకుడు రవీంద్రనాఽథ్‌రెడ్డి శనివారం దర్గామిట్టలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలను సజావుగా నిర్వహించాలని తెలిపారు. మాస్ కాపీయింగ్‌కు తావు లేకుండా పక్కాగా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఈఓ బాలాజీరావు, ఏపీ ఓపెన్ స్కూల్ కో–ఆర్డినేటర్ అనుముల్లాఖాన్ తదితరులు పాల్గొన్నారు.
పరీక్ష జరిగే సమయం : ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు
కంట్రోల్‌రూమ్ నంబర్ : 83414 08109
హాల్ టికెట్ డౌన్‌లోడ్‌కు పెట్టిన
వాట్సాప్ నంబర్ : 95523 00009
కంట్రోల్‌రూమ్ ఏర్పాటు
విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం విద్యాశాఖ అధికారులు కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఫోన్ చేసి ఇబ్బందులు చెబితే వెంటనే స్పందిస్తారు. కేంద్రాల్లో మెడికల్ కిట్లతో ఏఎన్‌ఎంలు అందుబాటులో ఉంటారు. విద్యార్థులకు తాగునీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఎగ్జామ్ టైంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ఆ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు.
పరీక్షలు సజావుగా జరిగేలా చర్యలు
పదో తరగతి పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో రాసేలా చర్యలు తీసుకున్నాం. మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ఎవరైనా మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ఎగ్జామ్స్ రాయాలి. గంట మందుగానే కేంద్రానికి చేరుకోవాలి.
– ఆర్.బాలాజీరావు, డీఈఓ
‘పది’ పరీక్షలకు సర్వం సిద్ధం


