
వైభవంగా జరుగుతున్న రథోత్సవం(ఇన్‌సెట్‌లో) విశేష అలంకరణలో స్వామి, అమ్మవారు
రాపూరు: మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోనలో స్వయంభువుగా వెలసిన శ్రీపెనుశిల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వాతి నక్షత్రం, దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం అత్యంత వైభవంగా రథోత్సవం నిర్వహించారు. ఉదయం సుప్రభాతం, మూలమూర్తికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి స్వామివారి మూలమూర్తిని చందనంతో అలంకరించారు. అనంతరం స్వామివారి అలంకార మండపంలో శ్రీపెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి స్వామి, అమ్మవార్లను శ్రీకృష్ణుడు, దేవేరులుగా శోభయమానంగా అలంకరించారు. తదుపరి శాంతిహోమం నిర్వహించారు. అనంతరం దేవదేవేరులను రఽఽథంపై కొలువుతీర్చి కోనలో క్షేత్రోత్సవం నిర్వహించారు. ఈ రఽథోత్స వం ఆర్టీసీ బస్టాండ్ వరకు కొనసాగింది. అక్కడ ఏర్పాటు చేసిన నరకాసుని ప్రతిమను స్వామి వారి విల్లుతో దహనం చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి దీపావళి పర్వదినం విశిష్టతను అర్చకులు భక్తులకు వివరించారు. కార్యక్రమంలో ఈఓ జనార్దన్‌రెడ్డి, ఆలయ ప్రధానార్చకులు రామయ్యస్వామి, పెంచలయ్యస్వామి, అర్చకులు శశిస్వామి, వినోద్‌స్వామి, నాగరాజస్వామితోపాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
