పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్న బాధితురాలు దేవరాల సమరా
నెల్లూరు(వీఆర్సీసెంటర్): బతికున్న వారిని సైతం చనిపోయినట్లుగా పేర్కొంటూ వారి ఓట్లను తొలగించాలని కార్పొరేషన్ అధికారులకు కొందరు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పంపుతున్నారు. అయితే ఈ తొలగింపు జాబితాలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల పేర్లు ఉండడం చూస్తుంటే టీడీపీ వర్గాలే ఇలా దరఖాస్తు చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. నగరంలోని 54వ డివిజన్ జనార్దనరెడ్డి కాలనీలోని బర్మాషెల్‌గుంట ప్రాంతానికి చెందిన దేవరాల సమరా (తండ్రి దేవరాల శివరామకృష్ణ) నివాసం ఉంటోంది. ఈమెకు పోలింగ్ బూత్ నం.10లో ఓటు హక్కు ఉంది.
అయితే దేవరాల సమరా మృతిచెందిందని ఆమె ఓటును తొలగించాలని ఫాం–7 కింద దరఖాస్తు అందింది. అలాగే ఇదే డివిజన్‌కు చెందిన గౌస్‌బాషాకు పోలింగ్‌బూత్ 10లో ఓటు హక్కు ఉంది. ఎస్‌కే మస్తాన్, పెల్లగిరి దేవదానం 9వ నంబర్ పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు కలిగి ఉన్నారు. వీరందరూ జీవించి ఉండనేగా మృతిచెందారని, వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని కార్పొరేషన్ అధికారులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందాయి.
అయితే వీరందరూ వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు కావడం గమనార్హం. పక్కా ప్రణాళిక ప్రకారం టీడీపీ నాయకులే తప్పుడు సమాచారంతో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన దేవరాల సమరా తాను బతికే ఉన్నా చనిపోయినట్లుగా ఫాం–7 సమర్పించిన వారిపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం కార్పొరేషన్ అధికారులకు, నవాబుపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


