సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యను పరిష్కరించే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ సచివాలయ, వలంటీర్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. వాటి ద్వారా నాలుగేళ్లలో సుమారు 2.5 లక్షల మందికిపైగా ఉద్యోగావకాశాలు కల్పించారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు జారీ చేస్తున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువతకు చదువు ఒక్కటే సరిపోదని, నైపుణ్య శిక్షణలు సైతం ఇచ్చి జాబ్ మేళాల ద్వారా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు.
జాబ్‌మేళాలతో ఉద్యోగావకాశాలు
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక 2019 నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మండల, నియోజకవర్గాలు, ప్రత్యేక స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు, డిగ్రీ కళాశాలల్లో సుమారు 78 జాబ్‌మేళాలు నిర్వహించారు. ఆయా జాబ్‌మేళాలకు 13,993 మంది హాజరయ్యారు. ఇప్పటి వరకు 335 ఎంఎన్‌సీ కంపెనీల్లో మంచి ప్యాకేజీతో 4,615 మంది ఉద్యోగావకాశాలు పొందారు.
దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి హయాంలో..
దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హయాంలో ఆత్మకూరు ప్రాంతంలో ఉద్యోగ విప్లవం జరిగింది. ఆయన మెట్ట ప్రాంతాలైన ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో పరిశ్రమల ఆధారిత నైపుణ్య శిక్షణలు ఇప్పించి ఉద్యోగావకాశాలు కల్పించారు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో రెండు దఫాలు ఆత్మకూరులో జాబ్‌మేళాలు నిర్వహించి రెండు వేల మందికి ఉద్యోగాలు ఇప్పించారు.
● 2019 నవంబర్‌లో ఆత్మకూరు పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన తొలి జాబ్‌మేళాకు 1,716 మంది నిరుద్యోగులు హాజరవగా, 424 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అలాగే 674 మందికి ఒక నెల పాటు నైపుణ్య శిక్షణ అందించి వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించారు. వారితో పాటు మరో 213 మందికి దీర్ఘకాలిక శిక్షణ ఇప్పించి వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించారు.
● 2020 అక్టోబర్ 30న ఆత్మకూరులోని పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన మరో జాబ్‌మేళాకు 2,437 మంది నిరుద్యోగులు హాజరవగా, 25 కంపెనీలకు 840 మంది ఎంపికయ్యారు.