● నిలువునా చీలిన నెల్లూరు టీడీపీ
● జిల్లా కార్యాలయంలో కుమ్ములాట
నెల్లూరు (టౌన్) : నెల్లూరు నగరంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఎవరికి వారే అన్నచందంగా జరిగింది. దీంతో ఆ పార్టీలోని వర్గ విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. నగరంలోని నర్తకి సెంటర్‌లో బుధవారం టీడీపీ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమం ఆ పార్టీ నగర అధ్యక్షుడు ధర్మవరపు సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి నగర ముఖ్యనేతలెవరూ హాజరు కాలేదు. ఎలాంటి సమాచారం లేకుండా కార్యక్రమం నిర్వహించడంతో ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. కాగా రూరల్ నియోజకవర్గ పరిధిలోని మూలాపేటలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద నగర నియోజకవర్గ ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డితో పాటు అజీజ్, ఇతర నాయకులు వేడుకలు నిర్వహించారు. అదే విధంగా జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు హాజరైన నాయకులు కుమ్ములాటకు దిగారు. రూరల్ నియోజకవర్గ పరిధిలో ఓ డివిజన్‌లోని నాయకుల మధ్య విబేధాలు ఒకరిపై ఒకరు చేయిచేసుకునే స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఓ మహిళా నేతను తోసేశారు. ఇటీవలే టీడీపీలో అంతా తామైనట్లు చేరిన కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి గానీ అయన అనుచరులు గానీ ఈ వేడుకల్లో ఎక్కడా పాల్గొనకపోవడం చర్చకు దారి తీసింది.