నెల్లూరు (టౌన్) : జిల్లాలోని ప్రత్యేక అవసరాల పిల్లలకు 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి వారి తల్లిదండ్రుల అకౌంట్లలో రూ.53.13 లక్షలు జమచేసినట్లు సమగ్రశిక్ష సహిత విద్య కో–ఆర్డినేటర్ ధనమ్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న 1,173 మంది దివ్యాంగ బాలికలకు ఉపకార వేతనం రూ.2 వేలు చొప్పున మొత్తం రూ.23.46 లక్షలు, ప్రత్యేక అవసరాలు కలిగిన 375 మంది విద్యార్థులకు ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ కింద రూ.3 వేలు చొప్పున రూ.11.25 లక్షలు, తీవ్ర, అతి తీవ్ర మేధా వైకల్యం కలిగి పాఠశాలలకు వెళ్లలేని 363 మంది పిల్లలకు ఎస్కార్ట్ అలవెన్స్ కింద రూ.3 వేల చొప్పున రూ.10. 89 లక్షలు, కండరాల కదలికలు లేని పిల్లలు, బుద్ధి మాంధ్యం కలిగిన పిల్లలకు సహిత విద్య రీసోర్స్ ఉపాధ్యాయులు ఇంటి వద్దకే వెళ్లి బోధన అందిస్తారు. అలాంటి 251 మందికి గృహ ఆధారిత విద్య అలవెన్స్ కింద రూ.3 వేలు చొప్పున రూ.7.53 లక్షలను గత రెండు రోజుల నుంచి ఆయా అకౌంట్లలో జమ చేసినట్లు పేర్కొన్నారు.