సుస్థిర అభివృద్ధి సాధించేందుకు కృషి | Sakshi
Sakshi News home page

సుస్థిర అభివృద్ధి సాధించేందుకు కృషి

Published Thu, Mar 30 2023 12:30 AM

మాట్లాడుతున్న విజయ్‌కుమార్‌, 
చిత్రంలో కలెక్టర్‌, ఎస్పీ తదితరులు  - Sakshi

నెల్లూరు(అర్బన్‌): జిల్లా సుస్థిర అభివృద్ధి సాధించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని రాష్ట్ర ప్లానింగ్‌ శాఖ కార్యదర్శి జీఎస్‌ఆర్‌కేఆర్‌ విజయ్‌కుమార్‌ అన్నారు. రాష్ట్ర ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ శాఖల హెచ్‌ఓడీలు, ప్రధాన బాధ్యులతో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు తీసుకోవాల్సిన చర్యలు, స్పందనలో వచ్చిన అర్జీల పరిష్కారంపై వర్క్‌షాపును బుధవారం నెల్లూరులోని కస్తూర్బా కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ ధనిక, పేదల మధ్య తీవ్రస్థాయిలో ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ఐక్యరాజ్యసమితి మిలీనియం సమీకృత అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించిందన్నారు. పేదరికం, ఆకలిని నివారించి ఆరోగ్యం, నాణ్యమైన విద్య, పరిశుభ్రమైన తాగునీరు లాంటి లక్ష్యాల సాధనకు ప్రపంచవ్యాప్తంగా 56 సూచికలతో ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు పేదరికం అడ్డంకిగా మారిందని యూనిసెఫ్‌ గుర్తించిందన్నారు. పేదరికాన్ని తగ్గించేందుకు పలు సూచికలు ఇచ్చినట్లు చెప్పారు. వాటికి అనుగుణంగా పనిచేయాలన్నారు. ఆకలిని పారదోలాలన్నారు. విద్య, లింగ సమానత్వం, పౌష్టికాహారం, శిశు, గర్భిణుల మరణాలు, వ్యాధులు, కాలుష్యం, పరిశ్రమలు, కనీస అవసరాలు తీర్చడం, అవినీతి నిర్మూలన, సమన్యాయం, సమానత్వం తదితర అంశాలపై వివరించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో భాగంగా స్పందన కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఇది ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతుందన్నారు. జిల్లాలో అందిన అన్ని శాఖల అర్జీలను గడువులోగా పరిష్కరించారని, ఇందుకు కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు, ఎస్పీ విజయారావును అభినందిస్తున్నట్లు తెలిపారు.

సచివాలయాల ద్వారా..

కలెక్టర్‌ మాట్లాడుతూ మొదటి నుంచి నెల్లూరు జిల్లా గుడ్‌ గవర్నెన్స్‌కు పెట్టింది పేరన్నారు. ప్రజలను, ప్రభుత్వాన్ని మమేకం చేస్తూ జిల్లాలో ఎందరో అధికారులు చెరగని ముద్ర వేశారన్నారు. అలాంటి వారిలో ఎస్‌ఆర్‌ శంకరన్‌ ప్రతి అధికారికి స్ఫూర్తిదాయకమన్నారు. జిల్లాలో 725 సచివాలయాల ద్వారా ప్రజలకు సేవలందుతున్నాయన్నారు. మహిళలు, పిల్లల ఆరోగ్య సూచికలో ముందుండేలా అధికారులు కృషి చేస్తున్నారన్నారు. ఎస్పీ మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో వచ్చే అర్జీల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ కూర్మనాఽఽథ్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ హరిత, కందుకూరు సబ్‌ కలెక్టర్‌ శోభిక, అడిషనల్‌ ఎస్పీ హిమవతి, ఆర్డీఓలు మలోల, శీనానాయక్‌, కరుణకుమారి, సీపీఓ సాల్మాన్‌రాజు, తహసీల్దార్లు, డాక్టర్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికే

స్పందన కార్యక్రమం

ప్లానింగ్‌ శాఖ కార్యదర్శి

విజయ్‌కుమార్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement