
వాహన రికార్డులు పరిశీలిస్తున్న రవాణా శాఖ అధికారులు (ఫైల్)
వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సివస్తోంది.లైసెన్స్‌లు లేకుండా, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వాహనాలు నడిపే వారిపై రవాణా శాఖ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. మార్పు తీసుకొచ్చేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయినా వాహనదారుల తీరు మారకపోగా వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. పోలీసు, రవాణా శాఖ అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారే తప్ప లైసెన్స్ తీసుకోవడం, ట్రాఫిక్ రూల్స్ పాటిద్దామన్న ఆలోచనే ఉండడం లేదు.
నెల్లూరు(టౌన్): ప్రజలు వాహనాల కొనుగోలులో చూపించిన ఆసక్తి లైసెన్స్‌లు తీసుకోవడంలో ఉండడం లేదు. ప్రస్తుత బిజీ లైఫ్‌లో ప్రతి ఒక్కరూ ద్విచక్ర, లైట్ మోటార్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. లైసెన్స్‌లు లేకుండా, నిబంధనలు పాటించకుండా వాహనాలను నడపడం వల్ల నిత్యం జిల్లాలో పలు ప్రమాదాలు చోటుచేసుకుని పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు ఎక్కాలంటే లైసెన్స్‌తోపాటు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం తప్పనిసరి అన్న ఆలోచనను విస్మరిస్తున్నారు. ప్రధానంగా లైసెన్స్ లేకుండానే యువతతోపాటు మైనర్లు రోడ్లపై బైకులతో రయ్ రయ్ మంటూ దూసుకుపోతున్నారు. ఓ వైపు పోలీసు, రవాణా శాఖ అధికారులు రహదారులపై వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నా తప్పించుకుని పోయేందుకు ప్రయత్నిస్తున్నారే తప్ప లైసెన్స్ తీసుకోవడంతోపాటు ట్రాఫిక్ రూల్స్ పాటిద్దామన్న ఆలోచనే ఉండడం లేదు. ఈ నిర్లక్ష్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకుని కన్నవారికి గుండెకోత మిగులుస్తూ భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు. ఇప్పటికై నా లైసెన్స్ లేని, నిబంధనలు పాటించని వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రమాదాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
తల్లిదండ్రులే స్వయంగా..
పాఠశాలలు, కళాశాలలు, షాపింగ్ పేర్లతో మైనర్లయిన పిల్లలకు వాహనాలు ఇచ్చి తల్లిదండ్రులే స్వయంగా రోడ్లపైకి పంపుతున్నారు. ప్రధానంగా లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే ప్రమాదం జరిగినా కనీసం ఇన్సూరెన్స్ కూడా రాదు. ఈ విషయం తెలిసినా వాహనదారులు పట్టించుకోవడం లేదు. జిల్లాలో వాహనాలున్న వారిలో సగం మందికి కూడా లైసెన్స్‌లు లేవు. వాహనాల సంఖ్యను ఒకసారి పరిశీలిస్తే 28,632 హెవీ, మీడియం లారీలు, 7,244 మూడు చక్రాల గూడ్స్ వాహనాలు, 58,739 ఆటో రిక్షాలు, 26,302 కమర్షియల్ ట్రాక్టర్లు, 32,357 అగ్రికల్చర్ ట్రాక్టర్లు, 59,364 కార్లు, 6,24,958 మోటారు సైకిళ్లు, 32,357 ఆలిండియా, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌లున్నాయి. వీటితోపాటు పలు రకాల వాహనాలు కూడా ఉన్నాయి. అయితే రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న వారిలో అధికంగా లైసెన్స్ లేని వారినే రవాణా, పోలీసు శాఖల అధికారులు గుర్తించారు. ట్రాఫిక్ నిబంధనలు, లైసెన్స్‌లపై ప్రతి ఏటా రవాణాశాఖ ఆధ్వర్యంలో ఎల్‌ఎల్‌ఆర్ మేళా, రహదారి భద్రతా వారోత్సవాలను వారంరోజులపాటు నిర్వహిస్తున్నారు. వీటితోపాటు ఇటీవల డ్రంక్ అండ్ డ్రైవ్, మితి మీరిన వేగం, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం, ఓవర్ లోడ్ తదితర వాటిపై జరిమానాలు విధిస్తున్నా వాహనదారుల్లో మార్పు రావడం లేదు.