Yuvraj Singh-Virat Kohli: నువ్వు ప్రపంచానికి కింగ్‌ కోహ్లివి కావొచ్చు.. కానీ నాకు మాత్రం: యువీ భావోద్వేగ లేఖ

Yuvraj Singh Heartfelt Note For Virat Kohli Mere Liye Tu Cheeku Rahega Viral - Sakshi

Yuvraj Singh Emotional Note For Virat Kohli:- ‘‘విరాట్‌... ఓ క్రికెటర్‌గా... వ్యక్తిగా నువ్వు ఎదిగిన తీరును నేను కళ్లారా చూశాను. నెట్స్‌లో టీమిండియా దిగ్గజాలతో కలిసి భుజం భుజం రాసుకు తిరిగిన ఆ యువకుడు.. ఇప్పుడు నవతరానికి స్పూర్తిదాతగా.. లెజెండ్‌గా ఎదిగాడు. నీ క్రమశిక్షణ, ఆట పట్ల అంకితభావం, నిబద్ధత.. దేశంలోని ప్రతి యువ ఆటగాడికి స్పూర్తిదాయకం. నిన్ను, నీ ప్రయాణాన్ని చూస్తే ఏదో ఒక రోజు టీమిండియాకు ఆడతామన్న నమ్మకం వారికి కలుగుతుంది.

ఏటికేడు నీ ఆట తీరు మెరుగుపడిన విధానం అమోఘం. ఇప్పటికే ఎన్నో అద్భుత విజయాలు సాధించావు. ఇంకెన్నో సాధించాల్సి ఉంది. నువ్వు లెజెండరీ కెప్టెన్‌వి. గొప్ప నాయకుడివి. నీ నుంచి మరెన్నో గొప్ప ఇన్నింగ్స్‌ రావాలని నేను కోరుకుంటున్నాను. సహచర ఆటగాడిగా, స్నేహితుడిగా నీతో ఉన్న బంధం గురించి మాటల్లో వర్ణించలేను. కలిసి పరుగులు సాధించడం, డైట్‌ విషయంలో చీటింగ్‌.. పంజాబీ పాటలు వినడం, కప్‌ గెలవడం... వీటన్నింటిలో మనం కలిసే ఉన్నాం. 

నువ్వు ప్రపంచానికి కింగ్‌ కోహ్లివి కావొచ్చు.. కానీ నాకు మాత్రం ఎప్పటికీ ‘చీకూ’(కోహ్లి ముద్దుపేరు)వే! నీలోని పట్టుదల, గెలవాలన్న కసి ఎప్పుడూ అలాగే ఉండాలి. నువ్వొక సూపర్‌స్టార్‌వి’’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌.. భారత మాజీ సారథి విరాట్‌ కోహ్లిని ఉద్దేశించి భావోద్వేగ లేఖ రాశాడు. తన కోసం గోల్డెన్‌ బూట్స్‌ కానుకగా పంపాడు. ఎప్పటిలాగానే కోహ్లి దేశాన్ని మరింత గర్వపడేలా చేయాలని ఆకాంక్షించాడు. కాగా యువీ, కోహ్లి మధ్య ప్రత్యేక అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే.

వీరిద్దరు కలిసి టీమిండియా తరఫున ఆడారు. అంతేగాక ప్రముఖ బ్రాండ్‌కు కలిసి ఎండార్స్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సదరు కంపెనీకి చెందిన షూస్‌ను కోహ్లికి కానుకగా పంపిన యువీ... ఈ మేరకు లేఖ రాశాడు. ఇక టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్న తర్వాత అనూహ్య పరిస్థితుల్లో వన్డే కెప్టెన్సీ కోల్పోయిన కోహ్లి.. దక్షిణాఫ్రికా పర్యటనలో ఘోర పరాభవం తర్వాత టెస్టు కెప్టెన్సీ తప్పుకొన్నాడు. కోహ్లి స్థానంలో రోహిత్‌ శర్మ మూడు ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్‌గా నియమితుడైన సంగతి తెలిసిందే.  

చదవండి: IPL 2022: రూ. 6.5 కోట్లే దండగ.. మళ్లీ వైస్‌ కెప్టెన్సీనా!? ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్యాన్స్‌ గరం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top