Younis Khan: కుంబ్లే బౌలింగ్‌లో డకౌట్‌.. మొయిన్‌ భాయ్‌ తిట్టాడు!

Younis Khan: When Got Duck Out Against India Moin Khan Scolded Him - Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ క్రికెట్‌ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు యూనిస్‌ ఖాన్‌. ముఖ్యంగా టెస్టు జట్టు మిడిలార్డర్‌ గొప్ప బ్యాట్స్‌మెన్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. సంప్రదాయ క్రికెట్‌లో 10 వేలకు పైగా పరుగులు చేసిన అతడు... వన్డేల్లో 7 వేల పరుగులు సాధించాడు. మూడు ఫార్మాట్లలోనూ పాకిస్తాన్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన యూనిస్‌ ఖాన్‌... ప్రస్తుతం బ్యాటింగ్‌ కోచ్‌గా సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. అతడి శిక్షణలోని పాక్‌ గత కొన్ని నెలలుగా మంచి విజయాలు నమోదు చేస్తోంది. ఇటీవల దక్షిణాఫ్రికా, జింబాబ్వేల్లో పర్యటించిన పాక్‌ జట్టు ఆ దేశాలను ఓడించి వరుస సిరీస్‌లు కైవసం చేసుకుంది.

ఇలా ఆటగాడిగా, కెప్టెన్‌గా, కోచ్‌గా ప్రతీ అంశంలోనూ తనదైన ముద్ర వేస్తున్న యూనిస్‌ ఖాన్‌.. కెరీర్‌ ఆరంభంలో మాత్రం బాగా తిట్లు తిన్నాడట. మాజీ కెప్టెన్‌ మొయిన్‌ ఖాన్‌ అతడికి చివాట్లు పెట్టాడట. ఈ విషయాల గురించి యూనిస్‌ ఖాన్‌ తాజాగా మాట్లాడుతూ... ‘‘నాకు గుర్తుంది. మొయిన్‌ ఖాన్‌ సారథ్యంలోనే నేను అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాను. అయితే, భారత జట్టుతో జరిగిన మ్యాచ్‌లో నేను డకౌట్‌గా వెనుదిరగటంతో భాయ్‌ నన్ను బాగా తిట్టాడు. తనకు చాలా కోపం వచ్చింది. ఏదేమైనా తనకు ధన్యవాదాలు చెప్పాలి. 

నిజానికి తన కారణంగానే నా తప్పులు సరిదిద్దుకోగలిగాను. ఎన్నో పాఠాలు నేర్చుకున్నా. అంతర్జాతీయ క్రికెట్‌లో నా విజయం వెనుక భాయ్‌ పాత్ర మరువలేనిది’’ అని గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. కాగా 2000 సంవత్సరం మార్చిలో షార్జాలో భారత్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో అనిల్‌ కుంబ్లే బౌలింగ్‌లో యూనిస్‌ డకౌట్‌ అయ్యాడు. ఇక ఈ మ్యాచ్‌లో గంగూలీ కెప్టెన్సీలోని టీమిండియా 5 వికెట్ల తేడాతో దాయాది జట్టుపై ఘన విజయం సాధించింది. మహ్మద్‌ అజారుద్దీన్‌(54 పరుగులు) ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. కాగా యూఏఈఓలో నిర్వహించిన కోకా కోలా కప్‌ మక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్‌, పాకిస్తాన్‌, దక్షిణాఫ్రికా జట్లు పాల్గొన్నాయి.

చదవండి: Viral: సిగ్గు పడాలి.. ఇలాగేనా పోరాడేది: భజ్జీ
Suryakumar Yadav: కోహ్లి నన్ను స్లెడ్జ్‌ చేశాడు.. సంతోషం!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top