Suryakumar Yadav: కోహ్లి నన్ను స్లెడ్జ్‌ చేశాడు.. సంతోషం!

Suryakumar Yadav: Happy When He Sledged Me On Clash With Virat Kohli - Sakshi

వెబ్‌డెస్క్‌: సూర్యకుమార్‌ యాదవ్‌.. గత కొన్నేళ్లుగా పొట్టి ఫార్మాట్‌లో అద్భుతమైన ఆటతో ఆకట్టుకుంటున్న క్రికెటర్‌. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. స్వదేశంలో ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భాగంగా టీమిండియా ప్రాబబుల్స్‌లో చోటు దక్కించుకున్న సూర్యకుమార్‌ యాదవ్‌.. రెండో టీ20 ద్వారా అరంగేట్రం చేశాడు. అయితే, ఆ మ్యాచ్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, మరో అరంగేట్ర ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది.

దీంతో సూర్యకుమార్‌కు బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. ఈ క్రమంలో నాలుగో టీ20 ద్వారా టీమిండియాకు ఆడాలన్న తన కల నెరవేర్చుకున్న సూర్య.. సిక్సర్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగుల ఖాతా తెరిచాడు. అంతేగాక, తొలి మ్యాచ్‌లోనే హాఫ్‌ సెంచరీ కొట్టిన ఐదో భారత క్రికెటర్‌గా ఘనత సాధించాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌ గురించి కాసేపు పక్కన పెడితే.. తనకెంతగానో గుర్తింపు తీసుకువచ్చిన ఐపీఎల్‌, ముఖ్యంగా తాను ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై జట్టు అంటే సూర్యకుమార్‌కు ప్రత్యేక అభిమానం అన్న సంగతి తెలిసిందే. 

కోహ్లి వర్సెస్‌ సూర్య!
ఇక గతేడాది సీజన్‌లో అద్భుతంగా రాణించిన సూర్య... రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుతో జరిగిన కీలకమైన మ్యాచ్‌లో జట్టును గెలిపించి.. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచి ఐపీఎల్‌-2020 ఆల్బమ్‌లో మరో జ్ఞాపకాని​ చేర్చుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌ కారణంగా, ముంబై ఎనిమిదో విజయం తన ఖాతాలో వేసుకుని ప్లేఆఫ్స్‌కు చేరువైంది. ఇక ఈ మ్యాచ్‌ సందర్భంగా ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ మధ్య జరిగిన ఘటన ఐపీఎల్‌ ప్రేమికులకు గుర్తుండే ఉంటుంది. ఈ మ్యాచ్‌లో 13వ ఓవర్‌లో కోహ్లి బంతిని షైన్‌ చేస్తూ సూర్య వద్దకు వచ్చిన కోహ్లి దూకుడుగా వ్యవహరించాడు. అద్భుతమైన షాట్లు ఆడుతున్న అతడితో వాగ్వాదానికి సిద్ధమయ్యాడు. 

అయితే సూర్యకుమార్‌ ఏమాత్రం స్పందన లేకుండా కళ్లతోనే బదులిస్తూ, కోహ్లికి దూరంగా వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో అప్పట్లో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. తాజాగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన లైవ్‌ చాట్‌లో ఈ ఘటన గురించి ప్రస్తావన రాగా సూర్యకుమార్‌ తనదైన శైలిలో స్పందించాడు. ‘‘కోహ్లి మైదానంలో చాలా ఎగ్జైటెడ్‌గా ఉంటాడు. కేవలం నాతోనే కాదు, ఏ బ్యాట్స్‌మెన్‌తోనైనా అలాగే దూకుడుగా ఉంటాడు. నిజానికి తను నన్ను స్లెడ్జ్‌ చేసినందుకు చాలా సంతోషంగా అనిపించింది. 

ఎందుకంటే... నేను బాగా ఆడితే మ్యాచ్‌ గెలుస్తామని తను భావించాడు. నా వికెట్‌ తీయాలని, తద్వారా గెలుపొందాలని వారి వ్యూహం. అంటే, నా బ్యాటింగ్‌ వల్ల వారికి ప్రమాదం పొంచి ఉందనే అర్థం కదా. అయితే ఇదంతా ఆట వరకే. నిజానికి కోహ్లి అంటే నాకు చాలా గౌరవం ఉంది. ఘటన తర్వాత, మైదానం వెలుపల తను నాతో ఎంతో నార్మల్‌గా ఉన్నాడు’’ అని చెప్పుకొచ్చాడు. అదే విధంగా, తనకు అవకాశం వచ్చినపుడు కచ్చితంగా బౌలింగ్‌ కూడా చేస్తానని పేర్కొన్నాడు. కాగా ఆ మ్యాచ్‌లో సూర్యకుమార్‌ (43 బంతుల్లో 79 నాటౌట్‌; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) సూపర్‌ ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

చదవండి: England Tour: ‘బయో బబుల్‌’లోకి కోహ్లి, రోహిత్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top