
టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)పై ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ మార్క్ బుచర్ ప్రశంసలు కురిపించాడు. మిడిలార్డర్‌లో కీలకమైన నాలుగో స్థానంలో చక్కగా రాణిస్తున్నాడని.. సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లిల స్థానాన్ని అతడు భర్తీ చేస్తున్నాడని కొనియాడాడు. తీవ్రమైన ఒత్తిడిలోనూ బ్యాటర్‌గా అదరగొడుతున్నాడని.. మంచినీళ్లప్రాయంలా పరుగుల వరద పారిస్తున్నాడని ప్రశంసించాడు.
ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా గిల్ భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా తన ప్రయాణం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌లో తొలుత టీమిండియాను ఓటమి పలకరించింది. లీడ్స్‌లో శుబ్‌మన్ గిల్ సహా కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (రెండు సెంచరీలు) శతక్కొట్టినా.. బౌలింగ్, ఫీల్డింగ్ వైఫల్యం వల్ల ఓటమిపాలైంది.
అయితే, రెండో టెస్టులో మాత్రం ఆ తప్పిదాన్ని పునరావృతం చేయలేదు. మరోసారి బ్యాటర్‌గా దుమ్ములేపిన గిల్.. కెప్టెన్‌గానూ అదరగొట్టాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ (269) కొట్టిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో భారీ శతకం (161)తో అలరించాడు.
సారథిగానూ తనదైన వ్యూహాలతో ముందుకు సాగి జట్టుకు చారిత్రాత్మక విజయం అందించాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌ను ఏకంగా 336 పరుగులతో ఓడించిన భారత్.. ఈ వేదికపై తొలిసారి విజయభేరి మోగించింది. ప్రస్తుతానికి సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
ఈ నేపథ్యంలో శుబ్‌మన్ గిల్‌ను ఉద్దేశించి మార్క్ బుచర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘క్రీడా ప్రపంచంలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఉండటం కంటే ఒత్తిడితో కూడిన బాధ్యత మరొకటి ఉండదు. ప్రతీ అడుగును నిశితంగా పరిశీలిస్తూ విమర్శలు చేస్తూ ఉంటారు.
బ్యాటింగ్ ఆర్డర్‌లో కోహ్లి, టెండుల్కర్ స్థానాన్ని గిల్ భర్తీ చేస్తున్నాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడిపై ప్రస్తుతం తీవ్రమైన ఒత్తిడి ఉంది. అయినా సరే.. మంచినీళ్లప్రాయంగా తన పని చేసుకుంటూ పోతున్నాడు. కొత్త బాధ్యతను ఎంతో చక్కగా, సౌకర్యవంతంగా నిర్వర్తిస్తున్నాడు’’ అని గిల్‌పై బుచర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇండియా టుడేతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు (జూలై 10-14)కు లార్డ్స్ వేదిక.