WTC Final 2023: ఆసీస్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్‌.. ప్రాక్టీస్‌ షురూ చేసిన టీమిండియా! ఫొటోలు వైరల్‌

WTC Final 2023 Ind Vs Aus: Team India Kick Start Preparations Pics - Sakshi

WTC Final 2023 India vs Australia: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌-2023 కోసం టీమిండియా సన్నాహకాలు మొదలుపెట్టింది. ఆస్ట్రేలియాతో కీలక పోరుకు భారత ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా తెలిపిన భారత క్రికెట్‌ నియంత్రణ మండలి.. ఇందుకు సంబంధించిన ఫొటోలను షేర్‌ చేసింది. కాగా స్వదేశంలో జరిగిన  బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2023లో టీమిండియా ఆస్ట్రేలియాను ఓడించి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే.

కెప్టెన్‌ ఐపీఎల్‌తో బిజీ
ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య ఇంగ్లండ్‌ వేదికగా మెగా పోరు జరుగనుంది. జూన్‌ 7- 11 వరకు ఓవల్‌ మైదానంలో టీమిండియా- ఆసీస్‌ మధ్య మ్యాచ్‌ నిర్వహించేందుకు షెడ్యూల్‌ ఖరారు చేశారు. జూన్‌ 12ను రిజర్వ్‌డేగా నిర్ణయించారు. ఇక టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌, సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ, అజింక్య రహానే, కేఎస్‌ భరత్‌ తదితరులు ఐపీఎల్‌-2023లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

వాళ్లేమో ప్రాక్టీసు మొదలెట్టారు!
అయితే, పదహారో ఎడిషన్‌లో ఇంటిబాట పట్టిన జట్ల ఆటగాళ్లలో.. డబ్ల్యూటీసీ ఫైనల్‌ టీమ్‌కు ఎంపికైన వారు కూడా ఉన్నారు. శార్దూల్‌ ఠాకూర్‌, ఉమేశ్‌ యాదవ్‌ తదితరులు ఇప్పటికే లండన్‌కు చేరుకున్నారు. టీమిండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మార్గదర్శనంలో ప్రాక్టీసు మొదలుపెట్టేందుకు సిద్ధమయ్యారు.

ఈ క్రమంలో కొత్త ట్రెయినింగ్‌ కిట్‌ను రివీల్‌ చేసిన బీసీసీఐ.. ఆటగాళ్ల ఫొటోలను కూడా పంచుకుంది. కాగా టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి, పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌, సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తదితరులు త్వరలోనే లండన్‌కు చేరుకోనున్నారు. ఐపీఎల్‌-2023 ముగిసిన తర్వాత రోహిత్‌తో పాటు మిగతా ఆటగాళ్లు కూడా జాయిన్‌ అవనున్నారు.

ఈసారి ఎలాగైనా గెలవాల్సిందే
కాగా డబ్ల్యూటీసీ 2021-23 సైకిల్‌లో ప్యాట్‌ కమిన్స్‌ సారథ్యంలోని ఆస్ట్రేలియా 19 మ్యాచ్‌లు ఆడి 11 విజయాలతో టేబుల్‌ టాపర్‌గా నిలిచింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌-2023లో అడుగుపెట్టిన తొలి జట్టుగా నిలిచింది. మరోవైపు టీమిండియా.. 18 మ్యాచ్‌లకు గానూ 10 గెలిచి.. బీజీటీ-2023లో ఆసీస్‌ను మట్టికరిపించడం ద్వారా తుదిపోరుకు అర్హత సాధించింది.

మొట్టమొదటి డబ్ల్యూటీసీ ట్రోఫీ గెలిచే అవకాశం చేజార్చుకున్న టీమిండియా ఈసారి ఆ తప్పు పునరావృతం చేయకుండా టైటిల్‌ గెలవాలని పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో పటిష్ట ఆసీస్‌ను ఢీకొట్టేందుకు అన్ని విధాలా సిద్ధమవుతోంది.

అదే కలవరపెట్టే అంశం
అయితే, గాయాల కారణంగా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, రిషభ్‌ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌ వంటి కీలక ఆటగాళ్లు లేకపోవడం ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ఫైనల్లో టీమిండియాను ఓడించి తొట్టతొలి డబ్ల్యూటీసీ చాంపియన్‌గా న్యూజిలాండ్‌ అవతరించిన విషయం తెలిసిందే.

డబ్ల్యూటీసీ ఫైనల్‌-2023: బీసీసీఐ ప్రకటించిన జట్టు ఇదే 
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, కేఎస్ భరత్ (వికెట్ కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్‌ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌).
స్టాండ్‌ బై ప్లేయర్లు: రుతురాజ్‌ గైక్వాడ్‌, ముకేశ్‌ కుమార్‌, సూర్యకుమార్‌ యాదవ్‌.

చదవండి: సీబీఐ డైరెక్టర్‌గా ప్రవీణ్‌ సూద్‌.. తెరమీదకు మయాంక్‌ అగర్వాల్‌ పేరు! కారణం?
BCCI: అవసరమా?.. ఐపీఎల్‌ యాజమాన్యానికి సజ్జనార్‌ రిక్వెస్ట్‌.. ట్వీట్‌తో..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top